Sunita Williams: భూమిపైకి చేరుకున్న నాసా వ్యోమగాములు

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌లుఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ.. మరో ఇద్దరు ఆస్ట్రోనాట్‌లతో కలిసి సురక్షితంగా పుడమిని చేరారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి బయల్దేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక బుధవారం తెల్లవారుజామున 3: 27 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగింది.
గంటకు 17 వేల మైళ్ల వేగంతో భూమివైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సుల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు తెరచుకున్నాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకొని క్యాప్సుల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. నాసా సిబ్బంది అక్కడికి చేరుకొని చిన్న చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చి.. ఒడ్డుకు చేర్చారు. అనంతరం వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించనున్నారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు.
మొదట్లో 8 రోజులు మాత్రమే అంతరిక్షంలో ఉంటారని భావించిన వ్యోమగాములు.. స్టార్ లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు. చివరికి నాసా స్టార్‌లైనర్‌ను ఖాళీగా తిరిగి పంపించింది. టెస్టర్ పైలట్‌లను స్పేస్‌ఎక్స్‌కు బదిలీ చేసింది. ఫిబ్రవరిలో రావాల్సి ఉండగా ఆలస్యం అయింది. స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్‌తో మరిన్ని సమస్యలతో మరో నెల అక్కడే ఉండాల్సి వచ్చింది. ఫలితంగా, విల్మోర్, విలియమ్స్ 286 రోజులు అంతరిక్షంలో గడిపారు. అనుకున్న దానికంటే 278 రోజులు ఎక్కువ. భూమి చుట్టూ 4,576 సార్లు పరిభ్రమించి 195 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com