Supreme Court:తమిళనాడు బిల్లుల జాప్యంపై మండిపడిన సుప్రీంకోర్టు

ఆమోదం కోసం పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను తమిళనాడు అసెంబ్లీ తిరిగి ఆమోదించి పంపినందున వాటిపై ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దామని వ్యాఖ్యానించింది. గవర్నర్ కార్యాలయం తరపున హాజరైన అటార్నీ జనరల్ వెంకటరమణి విచారణ వాయిదా వేయాలని కోరారు. ఐతే గవర్నర్ తన రాజ్యాంగ విధుల నిర్వహణలో ఆలస్యం చేస్తున్నారా అనేది అసలు సమస్య అని సుప్రీంకోర్టు పేర్కొంది.
అయితే తమిళనాడు ప్రభుత్వం పంపిన బిల్లుల విషయంలోకొన్ని జఠిలమైన అంశాలు ఉన్నాయని ఏజీ తెలిపారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలపడం, సమ్మతి తెలపకుండా నిలిపి ఉంచడం, రాష్ట్రపతి పరిశీలనకు బిల్లును పంపడం, మళ్లీ పరిశీలించాలని అసెంబ్లీకి తిప్పిపంపడం చేయాలని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం గుర్తుచేసింది.ఈ పనులేమీ గవర్నర్ చేయకపోవడం సమస్యకు అద్దం పడుతోందని పేర్కొంది.
ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాలు, నియామకాలు, మంత్రులు- ఎమ్మెల్యేలపై దర్యాప్తు వంటి దస్త్రాలకు అనుమతిలోగవర్నర్ జాప్యం చేస్తున్నారని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. గవర్నర్ చర్యలతో యంత్రాంగం మొత్తంఆగిపోయే పరిస్థితి తలెత్తిందని ఆరోపించింది. గవర్నర్ రవి నవంబర్ 2021లో బాధ్యతలు చేపట్టారని, అంతుకుముందు నుంచే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ.. ‘ఏ గవర్నర్ వల్ల బిల్లులు పెండింగ్‌లో పడ్డాయన్నది కాదు ప్రశ్న. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద లభించిన అధికారాలను వినియోగించడంలో గవర్నర్లు ఎందుకు జాప్యం చేశారన్నదే ప్రశ్న’ అని వ్యాఖ్యానించారు. బిల్లులను అటు వెనక్కి తిప్పి పంపకుండా లేదా ఇటు రాష్ట్రపతికి పంపకుండా తన వద్దనే తొక్కి పెట్టవచ్చా? అని నిలదీశారు.
పంజాబ్, కేరళల్లో కూడా గవర్నర్లు ఇలాగే చేస్తున్నారని ఆయా ప్రభుత్వాలు ఆరోపణలు చేస్తున్న క్రమంలో విచారించిన ధర్మాసనం గవర్నర్ల తీరును తప్పుపట్టింది. ఇటీవల గవర్నర్ల పనితీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆర్‌ఎన్ రవి అసెంబ్లీ ఆమోదం పొంది మూడేళ్లుగా గవర్నర్ ఆమోద ముద్ర కోసం పంపించిన బిల్లులను వెనక్కి పంపారు.
పిటిషన్‌పై విచారణను డిసెంబరు 1కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అటు కేరళ గవర్నర్ బిల్లులు ఆమోదించడంలేదని..ఆ రాష్ట్ర ప్రభు త్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వేరుగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్రం, గవర్నర్ కార్యాలయం సమాధానం కోరుతూ విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com