Case against Greta Thanberg: నిరసన తెలిపినందుకు కేసు నమోదు

Case against Greta Thanberg: నిరసన తెలిపినందుకు కేసు నమోదు

పోలీస్ అధికారుల ఆదేశాలు పాటించలేదని ప్రముఖ పర్యావరణవేత్త గ్రెటా థాన్‌బర్గ్‌పై స్వీడన్‌ దేశంలో కేసు నమోదైంది. ఈ సంవత్సరం జూన్‌ నెలలో మాల్మో పోర్ట్‌లో శిలాజల ఇంధనాలు సరఫరా చేసే ట్యాంకర్లను అడ్డుకుని నిరసన చేపట్టారు. వారించిన పోలీసుల ఆదేశాలను పట్టించుకోలేదని ఆమెపై తాజాగా అభియోగాలు మోపారు. జూన్ 19న స్వీడన్‌లోని మాల్మో ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్లని అడ్డుకుని గ్రెటా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వీటిని ఎక్కువగా వినియోగిస్తుడంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందని వారు ఆందోళనలు నిర్వహించారు.


గ్రెటాతో పాటు 20 యేళ్ల స్థానిక స్వీడన్‌కి చెందిన వ్యక్తి, మరో పర్యావరణవేత్తపై శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, ఆదేశాలు పాటించలేదని అభియోగాలు నమోదు చేశారు.

జూన్‌ నెలలో శిలాజ ఇంధనాల పరిశ్రమలకి వ్యతిరేకంగా టేక్ బ్యాక్ ఫ్యూచర్ పర్యావరణ రక్షణ సంస్థ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన శాంతయుత నిరసన కార్యక్రమాల్లో 20 మంది యువకులతో కలిసి గ్రెటా పాల్గొంది.


అభియోగపత్రం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పోర్ట్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఇంధనం వెళ్లకుండా 30 ట్రక్కులను ఆపారు. కార్యకర్తల్లో ఒకరు ట్రక్‌పైకి ఎక్కి ట్రక్కులను ముందుకు కదలకుండా చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంగ్లీష్, స్వీడన్ భాషల్లో అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. పోలీసు ఆదేశాలను గ్రెటా థాన్‌బర్గ్‌తో సహా మరో నలుగురు రోడ్డుపై అలాగే బైఠాయించారు. దీంతో పోలీసులు లాక్కెళ్లారని ఆ అభియోగపత్రంలో పోలీసులు వెల్లడించారు.


ఈ కేసు మాల్మో జిల్లా కోర్టులో ఈ నెలాఖరుకు రానుంది. స్వీడిష్ చట్టం ప్రకారం ఇటువంటి కేసుల్లో పోలీసుల ఆరోపణలు రుజువైతే గరిష్ఠంగా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎక్కువ కేసుల్లో జరిమానాలతో సరిపెడతారని న్యాయవాదులు తెలుపుతున్నారు. గ్రెటాపై అభియోగాలు, కేసులు ఇప్పుడే కొత్తేం కాదు. ఈ సంవత్సరం జనవరిలో పశ్చిమ జర్మనీ ప్రాంతంలో బొగ్గు గనుల విస్తరణకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించింది. అప్పుడు 3 రోజుల్లో 2 సార్లు ఆమెని అధికారులు అరెస్ట్ చేశారు.

ఈ అభియోగాలపై గ్రెటా థాన్‌బర్గ్ స్పందించలేదు. అయితే పర్యావరణ పరిరక్షణపై తను చేపట్టే కార్యక్రమాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకుంటోంది.

Tags

Read MoreRead Less
Next Story