Syria: కొత్త కరెన్సీని రిలీజ్ చేసిన సిరియా..

Syria:  కొత్త కరెన్సీని రిలీజ్ చేసిన సిరియా..
X
అసద్ చిత్రాలతో పాటు రెండు సున్నాలు తొలగింపు..

సిరియా తన ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. దాదాపు 60 ఏళ్ల బాత్‌ పార్టీ పాలన, అల్-అసద్ కుటుంబ ఆధిపత్యం ముగియటంతో.. కొత్త అధ్యక్షుడు అహ్మద్ అల్-షారా సోమవారం కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేశారు. ఈ మార్పు కేవలం కరెన్సీ మార్పిడి మాత్రమే కాదని, సిరియా నూతన జాతీయ అస్తిత్వానికి ప్రతీకగా ఆయన పేర్కొన్నారు.

పాత నోట్లపై ఉన్న మాజీ అధ్యక్షులు బషర్ అల్-అసద్, హఫీజ్ అల్-అసద్ చిత్రాలను పూర్తిగా తొలగించారు. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు.. కానీ దేశం శాశ్వతం అని పేర్కొంటూ.. కొత్త నోట్లపై వ్యక్తుల చిత్రాలకు బదులుగా సిరియా చారిత్రక కట్టడాలు, సంస్కృతిని ప్రతిబింబించే చిహ్నాలను ముద్రించారు. అంతేకాకుండా కరెన్సీ విలువలోని రెండు సున్నాలను(00) తొలగించి లావాదేవీలను సులభతరం చేశారు.

కేవలం సున్నాలు తొలగిస్తే ఆర్థిక వ్యవస్థ బాగుపడదని, ఉత్పత్తిని పెంచడం, నిరుద్యోగాన్ని తగ్గించడం ద్వారానే నిజమైన వృద్ధి సాధ్యమని అధ్యక్షుడు షారా స్పష్టం చేశారు. బ్యాంకులను "ఆర్థిక వ్యవస్థకు రక్తనాళాలు"గా ఆయన అభివర్ణించారు. ధరల స్థిరత్వం, పారదర్శకమైన విదేశీ మారకపు మార్కెట్, డిజిటల్ చెల్లింపులు, అంతర్జాతీయ ఆర్థిక అనుసంధానం వంటి ఐదు ప్రధాన స్తంభాల ఆధారంగా ఈ సంస్కరణలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఒక డాలర్ విలువ దాదాపు 11వేల సిరియన్ పౌండ్లుగా ఉంది. దీనివల్ల ప్రజలు చిన్న వస్తువుల కొనుగోలుకు కూడా కట్టల కొద్దీ నగదు తీసుకెళ్లాల్సి వస్తోంది. కొత్త కరెన్సీతో ఈ ఇబ్బందులు తొలగనున్నాయి. పాత నోట్లను మార్చుకునే విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని, ద్రవ్యోల్బణం పెరగకుండా క్రమంగా కొత్త నగదును మార్కెట్లోకి ప్రవేశపెడతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Tags

Next Story