ISRAEL: సిరియాపై ఇజ్రాయెల్ దాడి
గాజా, సిరియా, లెబనాన్ ఇలా మూడు వైపుల నుంచి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ దీటుగా బదులిస్తోంది. తాజాగా సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది. సిరియా రాజధాని డమాస్కస్ సహా అలెప్పోలోని అంతర్జాతీయ విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. విమానాశ్రయాల్లో రన్‌వేలు దెబ్బతిన్నాయి. ఆ రెండు విమానాశ్రయాలను మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. సిరియా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నౌకాశ్రయాలపై కూడా ఇజ్రాయెల్ దాడికి దిగింది. సిరియా నౌకాశ్రయాల నుంచి మిలిటెంట్లకు ఆయుధాలు సరఫరా కాకుండా ఇజ్రాయెల్ ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ దాడులపై ఇజ్రాయెల్ మిలటరీ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
హమాస్ మిలిటెంట్ సంస్థకు సిరియా మద్దతు ఇస్తూ ఇజ్రాయెల్‌పై దాడికి దిగడంతో ఇజ్రాయెల్ ప్రతిదాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని సిరియా ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడిని సిరియా వాయుసేనలు తిప్పికొడుతున్నట్లు వెల్లడించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సిరియా పర్యటించనుండగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటు. హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దళం.. రాత్రి, పగలు బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ అష్టదిగ్బంధనం చేయడంతో గాజాలో ఉన్న ఏకైక విద్యుదుత్పత్తి కేంద్రానికి ఇంధన సరఫరా నిలిచి అది మూతపడింది. ఫలితంగా గాజాలో విద్యుత్ లేక గాంఢాధకారం అలుముకుంది. చిమ్మచీకటిలోనూ హమాస్ తీవ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో గాజా దద్దరిల్లిపోతోంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో దేశ భద్రతమే ముఖ్యమంటూ ఇజ్రాయెల్ అధికార, ప్రతిపక్షాలు తొలిసారిగా చేతులు కలిపి యూనిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రతి హమాస్ సభ్యుడు హతమయ్యే వరకూ పోరాటం ఆగదని ప్రకటించారు. ఆ మేరకు రాత్రిళ్లు కూడా దాడులు కొనసాగుతున్నాయి.
మరోవైపు హమాస్ మిలిటెంట్లు చిన్న పిల్లల తలలు నరికిన చిత్రాలను చూసిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన జరిగిన రోజును యూదులకు ప్రాణాంతకమైన రోజుగా బైడెన్ తెలిపారు. హమాస్ మిలిటెంట్ల దుశ్చర్య క్రూరత్వానికి పరాకాష్టగా ఉందని.....చిన్న పిల్లల చిత్రాలు ఇంత దారుణంగా చూస్తాననుకోలేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో తలెత్తిన ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాను, యూఎస్ అధికారులు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడుతున్నామని తెలిపారు. ఈ ఘటన యూదులపై గతంలో జరిగిన మారణహోమాన్ని గుర్తుకు తెచ్చిందన్నారు. ఇటవంటి ఉగ్రవాద చర్యలను ఉపేక్షించేది లేదనన్నారు ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా మద్దతుగా నిలుస్తామనివారి కి అవసరమైన సైనిక సహాయం అమెరికా అందిస్తోందని తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com