Syria Crisis: సిరియా అధ్యక్షుడు అసద్ సేఫ్.. ఆశ్రయం కల్పించిన రష్యా

సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులు రష్యాకి చేరుకున్నారు. ఈ మేరకు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థలు నివేదించాయి. ఇస్లామిస్ట్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు సిరియాను తమ ఆధీనంలోకి తీసుకున్న కోవడంతో తన కుటుంబంతోపాటు అధ్యక్షుడు రష్యాలోని మాస్కోకి చేరుకున్నారు.”అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులకు మానవతా దృక్పథంతో రష్యా ఆశ్రయం కల్పించింది” అని స్థానిక వార్తా సంస్థ నివేదిక పేర్కొంది.
కాగా.. రెబల్స్ దూకుడుతో సిరియర్ బలగాలు, వారికి అండగా నిలిచిన రష్యన్ బలగాలు తోకముడిచాయి. అధికారం పోవడం ఖాయంగా కనిపించడంతో అస్సాద్ ముందుగా తన భార్య, పిల్లల్ని రష్యాకు తరలించారు. అనంతరం ఆయన కూడా దేశం వదిలిపెట్టారు. శాంతియుతంగా అధికారాన్ని అప్పగించాలనే ఆదేశాలు ఇవ్వడంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ తన పదవి నుంచి దిగిపోయి, దేశం వదిలిపెట్టినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. అసద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పలేమని, అతని నిష్క్రమణకు సంబంధించిన చర్చల్లో రష్యా పాల్గొనలేదని పేర్కొంది. అయితే.. సిరియాలోని రష్యా సైనిక స్థావరాలను హైఅలర్ట్‌లో ఉంచామని, ప్రస్తుతానికి వాటికి ఎలాంటి తీవ్రమైన ముప్పు లేదని చెప్పింది.
ఇదిలా ఉంటే, ఆదివారం దేశం విడిచివెళ్తున్న క్రమంలో బషర్ అల్ అస్సాద్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలి మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. డమాస్కస్ నుంచి బయలుదేరిన క్రమంలో హోమ్స్ నగరంపై విమానం మిస్సైనట్లు వార్తలు వచ్చాయి. తాజాగా రష్యా వార్తా సంస్థల కథనం ప్రకారం అస్సద్ సేఫ్‌గానే ఉన్నారని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com