Syria Civil War : డమాస్కస్‌ను ఆక్రమించుకున్న తిరుగుబాటుదారులు..

అంతర్యుద్ధంతో అట్టుకుతున్న సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌కు ఓటమి తప్పేలా లేదు. ఒక్కోనగరాన్ని చేజిక్కించుకుంటూ వస్తున్న తిరుగుబాటుదారులు ఏకంగా రాజధాని డమాస్కస్‌కు చేరుకున్నారు. ప్రభుత్వ బలగాల నుంచి ఎలాంటి ప్రతిఘటనా లేకపోవడంతో రాజధానిని ఆక్రమించుకున్నారు. చేజిక్కించుకునే అవకాశం ఉన్నది. డమాస్కస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రం నుంచి సిరియా బలగాలు వెనుతిరిగాయి. కాగా, 2018 తర్వాత రాజధాని సమీపంలోకి తిరుగుబాటుదారులు చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు అసద్ రాజధానిని విడిచి పారిపోయారు. విమానంలో గుర్తుతెలియని ప్రాంతానికి వెళ్లారని ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే ఆయన రష్యాకు చెక్కేశారన్న వార్తలను ప్రభుత్వ దళాలు ఖండించాయి.
ఉత్తర సిరియాపై హయాత్ తహరీర్ అల్-షామ్ నేతృత్వంలోని తిరుగుబాటుదళాలు పట్టుబిగిస్తుంటే, దక్షిణ సిరియాలోని పరిస్థితి కూడా అసద్ వ్యతిరేకంగా మారింది. కీలక నగరమైన దారాతోపాటు స్వీడియా తదితర ప్రాంతాల నుంచి సిరియా సైన్యాలు శనివారం వైదొలగడం వల్ల అవి తిరుగుబాటుదారుల వశమయ్యాయి. ఇక, డమాస్కస్ శివారు ప్రాంతాలైన మదామియా, జరామానా, దరాయల్లో తిరుగుబాటుదారుల కదలికలు కనిపిస్తున్నాయని పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
2011లో దారా నగరం నుంచి అసద్‌కు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత అది అంతర్యుద్ధంగా మారింది. దారాలోని 90శాతం భూభాగం స్థానిక తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దారాకు 50 కిలోమీటర్ల దూరంలోని సువైదా నుంచి కూడా ప్రభుత్వ దళాలు పారిపోయాయి. ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన మైనారిటీ డ్రూజ్ తెగ మిలిటెంట్లు డమాస్కస్ దిశగా సాగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. తిరుగుబాటుదారులు నగరాన్ని ఆక్రమిస్తారనే భయంతో డమాస్కస్‌లోని వేలాది మంది పౌరులు లెబనాన్ సరిహద్దులకు చేరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com