ఆప్ఘనిస్తాన్ ను వీడిన చివరి విమానం.. తాలిబన్లు సంబరాలు..!

అమెరికా విమానం అలా గాల్లో ఎగిరిందో లేదో.. వెంటనే సంబరాలు మొదలుపెట్టారు తాలిబన్లు. తాలిబన్లు తమ స్టైల్‌లో సంబరాలు చేసుకుంటున్నారు. తుపాకులతో గాల్లో కాల్పులు జరుపుతూ తమ శైలిలో సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. అమెరికన్లు వదిలి వెళ్లిన వాహనాల్లోకి ఎక్కుతూ, గెంతులేస్తూ ఓ రాక్షసానందాన్ని పొందుతున్నారు. ఆఫ్గాన్ నుంచి వెళ్లిపోతామన్న అమెరికా.. అన్నట్టుగానే ఇవాళ ఖాళీ చేసి వెళ్లిపోయింది. నిన్న అర్థరాత్రి సైనికులు, పౌరులతో కూడిన సీ-17 విమానం అమెరికాకు వెళ్లిపోయింది. దీంతో తమ ఆఖరి విమానం ఆఫ్గాన్‌ను వీడిందంటూ పెంటగాన్ అధికారికంగా ప్రకటించింది.
అమెరికా విమానం అలా గాల్లో ఎగిరిందో లేదో.. వెంటనే సంబరాలు మొదలుపెట్టారు తాలిబన్లు. నిన్నటి దాకా అమెరికా ఆధీనంలో ఉన్న కాబూల్ ఎయిర్‌పోర్టులోకి వెళ్లి, పెద్దపెద్దగా అరుస్తూ ఆ ప్రాంతం మొత్తం కలియదిరిగారు. ఎయిర్‌పోర్టులో అమెరికా వదిలి వెళ్లిన చాపర్స్, సాయుధ వాహనాలను పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్ హ్యాంగర్‌లో నాలుగు చినూక్ హెలికాప్టర్లు, హైటెక్ రాకెట్ డిఫెన్స్ సిస్టమ్, పలు సాయుధ వాహనాలు ఉన్నాయి. అయితే కాబూల్‌ను వీడే ముందు అమెరికా సైన్యం వీటన్నింటినీ డీయాక్టివేట్ చేసేసింది. వాటిని ఎవరూ ఆపరేట్ చేయలేరని... అవి గాల్లోకి ఎగరలేవని అమెరికా అధికారులు తెలిపారు.
ఆఫ్గాన్‌ను అమెరికా వదిలి వెళ్లిపోతే.. దాన్ని తమ విజయంగా సంబరాలు చేసుకుంటున్నారు తాలిబన్లు. ఇదే సమయంలో ఓ విచిత్రమైన ప్రకటన చేశారు. ఈ విజయం తమకెంతో సంతోషకరమని, దీన్నుంచి ప్రపంచం పాఠం నేర్చుకోవాలని చెప్పుకొచ్చారు. డెడ్‌లైన్‌కు ఒకరోజు ముందే ఆఫ్గాన్‌ను వీడినప్పటికీ.. అమెరికన్ల తరలింపు కొనసాగుతుందని ప్రకటించింది అమెరికా. ఇప్పటికీ కొంతమంది అమెరికన్లు ఆఫ్గాన్లోనే చిక్కుకుపోయారు. ఇక దేశం వదిలి వెళ్లాలనుకున్న ఆఫ్గాన్లు, ఇతర దేశస్తులు ఇంకా కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్దే పడిగాపులు కాస్తున్నారు. వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
ఆఫ్గాన్ నుంచి ఇతర విదేశీ సైన్యం సైతం వెళ్లిపోతుండడంతో.. స్వయం పాలనకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు తాలిబన్లు. తాలిబన్ల సుప్రీం కమాండర్ హైబతుల్లా నేతృత్వంలో.. త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. హైబతుల్లా పూర్తిగా తెరవెనుకనే ఉంటారని, కీలక నేత అబ్దుల్ బరాదర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలన సాగిస్తారని చెబుతున్నారు. తాలిబన్ల ప్రభుత్వంలో ఎవరెవరుండాలనే దానిపైనా సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయి. ఇవాళో రేపో దీనిపై తాలిబన్ల నుంచి అధికారిక ప్రకటన రాబోతోంది.
ఇదిలా ఉంటే.. ఆఫ్గాన్‌కు ఐసిస్ ఉగ్రవాదుల నుంచి ముప్పు అలాగా పొంచి ఉంది. ఆఫ్గాన్‌లో 2వేల మంది ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నట్లు అమెరికా అనుమానిస్తోంది. అమెరికా సైన్యం ఆఫ్గానిస్తాన్‌ను వీడిన నేపథ్యంలో ఐసిస్ మరిన్ని దాడులకు తెగబడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పైగా కొత్తగా రిక్రూట్‌మెంట్లు జరుపుతూ తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఐసిస్ ఉన్నట్లు
నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఐసిస్ గనక దాడులకు తెగబడితే... తాలిబన్లు కూడా దాడులకు పాల్పడుతారని, అదే జరిగితే ఆఫ్గాన్‌లో పెను విధ్వంసం తప్పకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com