Afghanistan: తాలిబన్ల వశమైన అఫ్ఘనిస్థాన్ ..లొంగిపోయిన ప్రభుత్వం..!

Afghanistan: అఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైంది. అక్కడి ప్రభుత్వం లొంగిపోయింది. దీంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు దేశ అధ్యక్షుడు అఫ్రఫ్ ఘనీ. కాబుల్ నగరంపై దాడులు చేయవద్దని.. అధికార మార్పిడికి సహాకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తాము దాడులు చేయబోమంటూ తాలిబన్లు(Talibans) వెల్లడించారు. దేశరాజధాని కాబూల్ నగరంలోకి ప్రవేశించిన తాలిబన్లు.. అధ్యక్ష భవనాన్ని సైతం హస్తగతం చేసుకున్నారు. పరిస్థితి విషమించడంతో తాను రాజీనామా చేసి అధికారమార్పిడి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించిన పత్రాలను సిద్దం చేస్తున్నట్లు వెల్లడించింది అధ్యక్ష భవనం.
అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్ నగరం(Afghanistan capital Kabul) తాలిబన్ల వశం కావడంతో అక్కడి రాయాబార కార్యాలయాల అధికారులను తమ దేశాలను రప్పించుకుంటున్నాయి. అమెరికా రాయబార కార్యాలయం సిబ్బంది స్వదేశానికి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే భారత్, తదితర దేశాల రాయబార సిబ్బంది స్వదేశాలకు చేరుకున్నారు. దీంతో కాబుల్ నగరంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ద ట్యాంకులతో నగరంలోకి ప్రవేశించిన తాలిబన్లు... ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, ప్రధాన కూడళ్లలో తమజెండాలను ఎగువేశారు. ఎక్కడికక్కడ కట్టడి చేశారు. రాజధానిని ఆక్రమించుకున్నట్లు ప్రకటించారు.
అంతకు ముందు దక్షిణాన ఉన్న లోగర్ రాష్ట్రాన్ని తాలిబన్లు పూర్తిగా ఆక్రమించుకున్నారు. ఐదో అతిపెద్ద రాష్ట్రమైన మజార్-ఏ-షరీఫ్‌పైనా ఆధిపత్యం సాధించారు. వీరు ఏ క్షణమైనా దేశ రాజధానిని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంది. రాజధానిలో పాగా వేయడంతో దేశాన్నిమొత్తం తమ హస్తగతం చేసుకున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకోసమే తాలిబన్లు దేశరాజధానివైపు గత కొద్దిరోజులుగా దూసుకొస్తున్నారు. కాందహార్‌లోని రేడియో స్టేషన్‌ను ఆక్రమించిన తాలిబన్లు... ఇక నుంచి ఇస్లామిక్ వార్తలనే ప్రసారం చేస్తామని ప్రకటించారు.
దేశంలోని పరిస్థితులపై దేశ అధ్యక్షుడు అఫ్రఫ్ ఘనీ నిన్న ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మరింత రక్తపాతం జరగనివ్వను. దేశంలో శాంతి, సుస్థిరతల స్థాపనపై దృష్టి సారిస్తాను అన్నారు. ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఆపాల్సి బాధ్యత తమపై ఉందన్నారు. తాలిబన్ల దురాక్రమణలతో అఫ్గాన్ ప్రభుత్వం నియంత్రణ కోల్పోతోందని ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్లు తక్షణమే దాడులను నిలిపివేయాలన్నారు. బలప్రయోగం సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారితీస్తుందని, అఫ్గాన్‌ను ఒంటరి దేశంగా మార్చుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపైనా, జర్నలిస్టులపైనా ఆంక్షలు విధించడం సరికాదన్నారు. బాలికలు, మహిళల పట్ల విచక్షణా రహితంగా ప్రవర్తించడం హృదయ విదారకంగా ఉందన్నారు. వెంటనే చర్చలు ప్రారంభించాలని తాలిబన్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com