తాలిబన్లపై తిరగబడుతున్న అఫ్గానీలు.. ప్రాణాలకు తెగించి మరి..!

అఫ్గానిస్థాన్ అట్టుడుకుతోంది. అఫ్గాన్‌ను తాలిబన్లు వశపరుచుకోవడంతో ప్రాణభయంతో అక్కడి ప్రజలు ఇతర దేశాలకు తరలిపోతున్నారు. హింసాత్మక ఘటనలతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఎలాగైనా ప్రాణాలు రక్షించుకోవాలని భావించిన ఓ వ్యక్తి కాబూల్ విమానాశ్రయం గోడపై నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. విమానాశ్రయం లోపల ఉన్న తాలిబన్ దీన్ని గమనించి అతడిపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ అతడికి సమీపంలో గోడకు తగలడంతో సదరు వ్యక్తి వెంటనే అవతలివైపునకు దూకాడు. ఈ వీడియోను అస్వాకా అనే న్యూస్ ఏజెన్సీ ట్విటర్‌లో పోస్టు చేసింది.
తాలిబన్ల పాలనపై అప్పుడే నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ప్రాణాలకు తెగించి తమ గొంతు వినిపిస్తున్నారు. జలాలాబాద్‌లో అఫ్గన్ జెండాతో స్థానికులు ర్యాలీ నిర్వహించారు. తాలిబన్ల పాలనపై నిరసన తెలిపారు. ఆందోళనపై తాలిబన్లు విరుచుకుపడ్డారు. విచక్షణ రహితంగా కాల్పులు జరపగా ఇద్దరు మరణించారు. మరో 12మందికి గాయపడ్డారు. అఫ్గాన్ తాజా పరిణామాలతో మళ్లీ మహిళలంతా ఆంక్షల వలయంలో బందీ కావాల్సిన పరిస్థితులు నెలకొంటాయనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. కాబుల్ వీధుల్లో మహిళలు ప్లకార్డులు ప్రదర్శించి, నిరసన తెలిపారు. ఇన్నేళ్లుగా సాధించిన విజయాలు, కనీస హక్కులు వృథాగా పోకూడదు అంటూ నినదించారు.
అఫ్గన్‌లో పరిస్థితులు దయనీయంగా మారాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు విమానాల్లో కిక్కిరిసి ఇతర దేశాలకు పారిపోతున్నారు. విమానం టైర్ల వద్ద నిల్చొని ప్రయాణించిన ముగ్గురు కిందపడి ప్రాణాలు కోల్పోయారు. కాబుల్ విమానాశ్రయం రన్‌వేపై నుంచి బయలుదేరుతున్న విమానం వద్ద గుంపులుగుంపులుగా ఉన్న జనం... ఆ విమానాన్ని ఎక్కేందుకు పరుగులు తీశారు. అటు.. అఫ్గానిస్థాన్‌లో ప్రధాన మీడియా సంస్థ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తాలిబన్ రాకతో ఆందోళన గురైన ఆ సంస్థ మొదట తమ మహిళా యాంకర్లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించింది. ఆ తర్వాత మళ్లీ విధుల్లోకి తీసుకుకుంది.
తాలిబన్లపై పోరాడేందుకు ఆయుధాలు చేతపట్టిన యోధురాలు, అఫ్గానిస్థాన్ మహిళా గవర్నర్‌లలో ఒకరైన సలీమా మజారీని తాలిబన్లు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తాలిబన్లు చొచ్చుకొని వస్తున్న క్రమంలో ప్రముఖ నేతలంతా ప్రాణభయంతో దేశం విడిచి పారిపోయారు. కానీ బాల్ఖ్ ప్రావిన్స్‌ను ఆక్రమించనున్నారని తెలిసినప్పటికీ.. ఆమె మాత్రం అక్కడే ఉండిపోయారు. ఆక్రమణల క్రమంలో ఇదివరకే ఆమె తన ప్రజల గురించి ఆందోళన వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com