Afghanistan: వారిని ఉరితీసే ఆలోచనలో తాలిబన్లు

Afghanistan: వారిని ఉరితీసే ఆలోచనలో తాలిబన్లు
Taliban:శత్రుశేషం మిగలకూడదన్న సిద్ధాంతంతో పనిచేస్తున్నారు తాలిబన్లు.

Taliban: శత్రుశేషం మిగలకూడదన్న సిద్ధాంతంతో పనిచేస్తున్నారు తాలిబన్లు. అమెరికా సైన్యానికి సహాయం చేసిన వారి గురించి వేట మొదలుపెట్టారు. ఇంటింటికీ తిరుగుతూ, విదేశీ సైనికులకు సాయం అందించిన వారి గురించి ఆరా తీస్తున్నారు. దీంతో శత్రువులను కూడా క్షమిస్తామని చెప్పిన మాటలు డొల్లవేనని తేల్చి చెబుతున్నాయి తాజా సంఘటనలు. అమెరికా, నాటో దళాలకు ఎవరెవరు సహాయంగా నిలిచారో వారందరినీ వేటాడడం మొదలుపెట్టారు.

కేవలం వ్యక్తుల్నే కాదు.. ఏకంగా కుటుంబాలనే టార్గెట్ చేశారు. వారు కనిపించడం ఆలస్యం దారుణ శిక్షలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు తాలిబన్లు. ఆఫ్గానిస్తాన్‌లో ఏం జరుగుతోందన్న దానిపై ఐక్యరాజ్యసమితి నివేదిక విడుదల చేసింది. ఆ రహస్య నివేదికలో కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడుతున్నాయి.

కాబుల్ ఎయిర్‌పోర్టుకి పరుగులు తీస్తున్న వాళ్లంతా.. అమెరికా, నాటో దళాలకు సహాయం చేసిన వారేనని తాలిబన్లు అనుమానిస్తున్నారు. దీంతో కాబుల్‌ ఎయిర్‌పోర్టుకి వచ్చి వెళ్లే వారిపై నిఘా పెట్టారు. వాళ్ల ఇళ్లకు వెళ్తున్నారు. కనిపించకుండా పోయిన వారి కోసం వెతుకుతున్నారు. షరియా చట్టాల ప్రకారం వారికి శిక్ష విధించాల్సిందేనని తాలిబన్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఇక దీనర్థం అమెరికన్లకు సహాయం చేసిన వారిని ఉరితీయడమే. కుటుంబంలో ఏ ఒక్కరు సైన్యానికి అండగా నిలబడినట్టు తెలిసినా.. మొత్తం కుటుంబాన్నీ శిక్షించబోతున్నారు తాలిబన్లు. వారి కుటుంబాలను నడివీధికి ఈడ్చి కర్రలు, కొరడాలు, రాళ్ల దెబ్బలతో కొట్టిస్తారు. అవసరమైతే వీటికి మించిన శిక్షలు అమలు చేయబోతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.

రెండు దశాబ్దాల క్రితం ఆఫ్గానిస్తాన్‌ ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే తయారవుతోంది. ప్రజలకు స్వేచ్ఛ లేదు, ఆడవాళ్లకు ఆంక్షలు తప్పడం లేదు. పిల్లలు ఆడుకోవడానికీ లేదు. మొత్తంగా తాలిబన్లు హామీ ఇచ్చిన విధంగా ఆఫ్గానిస్తాన్‌లో ఏ ఒక్కటీ జరగడం లేదు. నిరసనకారులు, శత్రువులను క్షమిస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు.

Tags

Read MoreRead Less
Next Story