6 Sep 2021 10:00 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / తాలిబన్ల వశమైన...

తాలిబన్ల వశమైన పంజ్‌షేర్.. పాక్ మద్దతు..

గవర్నర్‌ కార్యాలయంపై తాలిబన్ల జెండా ఎగిరింది. ప్రావిన్స్‌ మొత్తం తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లింది.

తాలిబన్ల వశమైన పంజ్‌షేర్.. పాక్ మద్దతు..
X

పంజ్‌షేర్‌ తాలిబన్ల వశమైంది. గవర్నర్‌ కార్యాలయంపై తాలిబన్ల జెండా ఎగిరింది. ప్రావిన్స్‌ మొత్తం తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లింది. ఇన్నాళ్లుగా తమ ప్రాంతాన్ని రక్షించుకుంటున్న ఫైటర్స్‌పై తాలిబన్లు పై చేయి సాధించారు. పంజ్‌షేర్‌ లోయను స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు అధికారికంగా ప్రకటించారు. పంజ్‌షేర్‌ను తాలిబన్లకు కట్టబెట్టడానికి ఏకంగా పాకిస్తానే రంగంలోకి దిగింది.

పంజ్‌షేర్‌ ఫైటర్లపై డ్రోన్లతో దాడి చేసింది పాకిస్తాన్‌. ఇందుకోసం ఐఎస్‌ఐ చీఫ్‌ ఫయాజ్‌ అహ్మద్‌ కొన్ని రోజులుగా కాబుల్‌లో తిష్టవేశారు. ఆయన కనుసన్నల్లోనే పాక్‌ వాయుసేన డ్రోన్లు, హెలికాప్టర్లు దాడులు చేసింది. అంతేకాదు, పాకిస్తాన్‌ సైన్యం తమ కమాండోలను కూడా ఎయిర్‌డ్రాప్‌ చేసినట్లు తెలుస్తోంది. అహ్మద్‌ మసూద్‌ కూడా పాక్‌ డ్రోన్ల దాడులను ధ్రువీకరించారు.

పంజ్‌షేర్‌ దళాలకు సాయం అందించడానికి ప్రపంచంలోని ఏ ఒక్క దేశం కూడా కదిలిరాలేదు. కాని, తాలిబన్లకు సాయంగా పాకిస్తాన్‌ బహిరంగంగా మద్దతు పలికింది. ఏకంగా పాక్‌ కమాండోలనే దింపింది. ఈ దాడుల్లో పంజ్‌షేర్‌ లోయ కీలక నాయకులను కోల్పోయింది.

పంజ్‌షేర్‌ దళాలకు అధికార ప్రతినిధి అయిన ఫాహిం దాస్తీతోపాటు అహ్మద్‌ షా మసూద్‌ మేనల్లుడు అబ్దుల్‌ వాదూద్‌ జహోర్‌ కూడా చనిపోయాడు. మరోవైపు ఆఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ఇంటిపై హెలికాప్టర్లతో దాడి చేశారు. అయితే, ఈ దాడి నుంచి అమ్రుల్లా తప్పించుకున్నాడని, సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయాడని తెలుస్తోంది.

వందల మంది తాలిబన్లను చంపేశామని ప్రకటించిన తరువాతి రోజే.. పంజ్‌షేర్‌ తాలిబన్ల వశం అయింది. ఖవాక్‌ మార్గం వద్ద జరిగిన పోరులో 700 మందికిపైగా తాలిబన్లు మరణించారని, మరో 600 మందిని నిర్బంధించి జైళ్లలో ఉంచామని పంజ్‌షేర్‌ ఫైటర్లు ప్రకటించారు. కాని, రోజు గడవక ముందే.. పంజ్‌షేర్‌ మొత్తం తమ ఆధీనంలోకి వచ్చేసిందని తాలిబన్ల నుంచి ప్రకటన వచ్చేసింది.

Next Story