అంతర్జాతీయం

KABUL, Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ 'తాలిబన్ల' పాదాక్రాంతం.. దేశానికి కొత్త పేరు

ఖతార్‌ నుంచి కాబూల్‌ చేరుకున్న తాలిబన్‌ అగ్రనేతలకు సాక్షాత్తు ప్రభుత్వ వర్గాలే ఘన స్వాగతం పలికాయి.

KABUL, Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పాదాక్రాంతం.. దేశానికి కొత్త పేరు
X

KABUL, Afghanistan: రక్తపాతం లేకుండానే ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల వశం అయింది. ఖతార్‌ నుంచి కాబూల్‌ చేరుకున్న తాలిబన్‌ అగ్రనేతలకు సాక్షాత్తు ప్రభుత్వ వర్గాలే ఘన స్వాగతం పలికాయి. అధ్యక్ష భవనంలో తాలిబన్లు అధికారులతో చర్చలు జరిపారు. ఆఫ్ఘనిస్తాన్‌ పేరును ఇక మీదట.. ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ఆఫ్‌ ఆఫ్ఘనిస్తాన్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు.

ఇక నిన్న మధ్యాహ్నం వరకు అధ్యక్ష భవనంలోనే ఉన్నట్లు అందరినీ నమ్మించి.. ప్రత్యేక విమానంలో తజకిస్తాన్‌కు పారిపోయారు అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ. ఆయన సేఫ్‌గా ఆఫ్ఘన్‌ విడిచి వెళ్లిపోయిన తరువాత గానీ.. అధ్యక్షుడు పారిపోయిన విషయాన్ని బయటపెట్టలేదు.

అష్రఫ్‌ ఘనీ ఎక్కడ ఉన్నారో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామంటూ తాలిబన్ ప్రతినిధులు ప్రకటన జారీ చేశారు. ఆఫ్ఘన్‌లో ఇక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని, తమ అధ్యక్షుడిగా బరాదర్ వ్యవహరిస్తారని ప్రకటించారు.

తాలిబన్ల రాజ్యం ఏర్పడడంతో వివిధ దేశాలు రాయబార కార్యాలయాలను ఖాళీ చేస్తున్నాయి. తమ సిబ్బందిని తీసుకురావడానికి 3వేల మంది అదనపు బలగాలను పంపించింది అమెరికా. ఇక భారత్‌ కూడా భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని నడుపుతోంది. నిన్న మధ్యాహ్నం 12.45కు ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం.. 129 మంది ప్రయాణికులతో సాయంత్రం 5.35కు భారత్‌కు బయలుదేరింది.

తాలిబన్ల ఆక్రమణతో కాబూల్‌లో అకృత్యాలు మొదలయ్యాయి. తాలిబన్ సైన్యం నగరాన్ని చుట్టుముట్టి, రాకపోకల్ని నిషేధించింది. మరోవైపు లూటీలు కూడా మొదలయ్యాయి. అల్లరి మూకలు దుకాణాలు, ఇళ్లలో దోపిడీలకు పాల్పడుతున్నారు. లూటీలను ఆపేందుకు తాలిబన్లు తమ సైన్యాలను రంగంలోకి దించాయి.

మరోవైపు, తాలిబన్లకు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పాకిస్థాన్ అయితే నిస్సిగ్గుగా తాలిబన్లకు మద్దతిచ్చింది. భారత్‌ను ఇరుకునపెట్టేందుకు చైనా సైతం తాలిబన్లకు సూత్రప్రాయంగా మద్దతు తెలిపింది. అటు రష్యా కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తాలిబన్ల ఆర్థిక మూలాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆఫ్ఘన్‌ ప్రభుత్వం సైన్యంపై పెట్టే ఖర్చు కంటే.. తాలిబన్ల బడ్జెట్టే ఎక్కువ. సైన్యం కోసం ఆఫ్ఘనిస్తాన్‌ 800 కోట్లు కేటాయిస్తే.. తాలిబన్లు 11వేల 829 కోట్లు ఖర్చుపెడుతున్నారు. అందుకే, ఏ ఒక్క దగ్గర కూడా తాలిబన్లను నిరోధించలేకపోయారు ఆఫ్ఘన్‌ సైనికులు.

ఫోర్బ్స్‌ 2016 జాబితా ప్రకారం.. ప్రపంచంలోని టాప్‌-10 సంపన్న ఉగ్రవాద సంస్థల్లో తాలిబన్లు ఐదో స్థానంలో ఉన్నారు. అప్పట్లో 2900 కోట్ల వార్షిక టర్నోవర్‌తో తాలిబన్‌ సంస్థ నిలిచింది. గతేడాదికి తాలిబన్ల వార్షిక బడ్జెట్‌ 11వేల 829 కోట్లుగా ఉందని నాటో తెలిపింది. అంటే, 2016 నుంచి తాలిబన్ల టర్నోవర్‌ 400 శాతం పెరిగిందని నాటో నివేదిక తెలిపింది.

Next Story

RELATED STORIES