Taliban: వంట గదికి కిటికీలు వద్దు.. తాలిబన్ల కొత్త రూల్‌

Taliban: వంట గదికి కిటికీలు వద్దు.. తాలిబన్ల కొత్త రూల్‌
X
మహిళల హక్కులను కాలరాస్తున్న అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్లు ప్రభుత్వం..

అఫ్గానిస్థాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. అక్కడి మహిళల హక్కులను క్రమంగా కాలరాస్తున్నారు. తాజాగా ఆ దేశ పాలకులు తీసుకు వచ్చిన డిక్రీ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కొత్తగా నిర్మించే ఇళ్లల్లో మహిళలు బయటి వారికి కనిపించేలా వంట గదికి కిటికీలు ఏర్పాటు చేయొద్దని ఆదేశాలు జారీ చేయడం నివ్వెరపరుస్తోంది.

అయితే, వంట గదులు, ఇంటి ఆవరణ, నీటి కోసం బావుల దగ్గరకు వచ్చిన మహిళలు బయటి వారికి కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు దారి తీసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మహిళలు కనిపించకుండా గోడలు కట్టాలి అని తాలిబర్లు పేర్కొన్నారు. ఇప్పటికే స్త్రీలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటిని తక్షణమే మూసివేయాలి అని అఫ్గాన్ లోని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు చేశారు. దీంతో మున్సిపల్ అధికారులు కొత్త నిర్మాణాలను పరిశీలించి.. కొత్త రూల్స్ అమలును పర్యవేక్షించనున్నారు.

ఇక, మతపరమైన ఆచారాల ముసుగులో మహిళల హక్కులు, స్వేచ్ఛను తాలిబన్‌ ప్రభుత్వం హరిస్తుంది. ఇప్పటికే జిమ్‌లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించింది. మిడిల్‌ స్కూల్‌, హైస్కూల్‌ విద్యకు బాలికల్ని దూరం చేయడంతో పాటు పలు రంగాల్లో మహిళ ఉద్యోగాలను పరిమితం చేస్తున్నారు. అలాగే, ఆటలాడటంపై నిషేధం, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తల నుంచి కాలి వరకు బట్టలు ధరించాలని కఠిన ఆంక్షలు విధించారు. తాలిబన్‌ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను గతంలో ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. జన జీవన స్రవంతి నుంచి మహిళల్ని క్రమపద్ధతిలో దూరం చేసేందుకు తాలిబన్లు ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదని పేర్కొనింది.

Tags

Next Story