European Union: ట్రంప్ తీరుకు వ్యతిరేకంగా ఈయూ దేశాల ఎమర్జెన్సీ మీటింగ్!

European Union: ట్రంప్ తీరుకు వ్యతిరేకంగా ఈయూ దేశాల ఎమర్జెన్సీ మీటింగ్!
X
డెన్మార్క్ సైనిక విన్యాసాలకు మద్దతు పలికిన ఈయూ నేతలు

గ్రీన్ లాండ్ ను అమెరికాలో కలిపేసుకోవాలన్న తన అభీష్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని ఈయూ కూటమిలోని 8 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ తాజాగా 10 శాతం టారిఫ్ లు విధించారు. అయితే, ఈ నిర్ణయాన్ని ఈయూ చీఫ్ లు తప్పుబట్టారు. ట్రంప్ బెదిరింపు సుంకాలపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో యురోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల అత్యవసర భేటీకి పిలుపునిచ్చారు. ఈ మేరకు యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లాన్, యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా సంయుక్తంగా ఓ ప్రకటన జారీ చేశారు.

ట్రంప్ ప్రతిపాదిత సుంకాలు సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈయూ– యూఎస్ సంబంధాలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఇందులో వారు హెచ్చరించారు. పరస్పర సహకారం తప్పనిసరిగా మారిన పరిస్థితుల్లో ఈ ధోరణి ఇరువైపులా నష్టం చేకూరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలు ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలను దెబ్బతీస్తాయని, వాణిజ్య అడ్డంకులకు ఊతమిస్తాయని చెప్పారు.

‘యూరప్ ఐక్యంగా, సమన్వయంతో మరియు దాని సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవడానికి కట్టుబడి ఉంటుంది’ అంటూ ఈయూ చీఫ్ లు ట్వీట్ చేశారు. మిత్రదేశాలతో కలిసి డెన్మార్క్ ఇటీవల గ్రీన్‌ల్యాండ్‌లో నిర్వహించిన సైనిక విన్యాసాలను కూడా వారు సమర్థించారు. ఆర్కిటిక్ ప్రాంతంలో భద్రతను పెంచడమే ఈ విన్యాసం ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇది ఏ దేశానికీ వ్యతిరేకం కాదని తెలిపారు. డెన్మార్క్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ చర్చల ప్రాముఖ్యతను ఈయూ గుర్తుచేసింది.

ఈ విషయంపై ఉర్సులా వాండెర్ లాన్ ఎక్స్ లో స్పందిస్తూ.. ప్రాదేశిక సమగ్రత మరియు సార్వభౌమాధికారం అంతర్జాతీయ చట్టం యొక్క ప్రాథమిక సూత్రాలని చెప్పారు. ఇవి యూరప్‌ తో పాటు మొత్తం అంతర్జాతీయ సమాజానికి అవసరమన్నారు. నాటో ద్వారా ఆర్కిటిక్‌లో శాంతి మరియు భద్రతపై మా ఉమ్మడి అట్లాంటిక్ ఆసక్తిని మేము నిరంతరం నొక్కిచెప్పామని వాండెర్ లాన్ పేర్కొన్నారు.

Tags

Next Story