USA: అమెరికా లాస్‌వేగాస్‌ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక సీఈఎస్‌ టెక్‌షో

USA: అమెరికా లాస్‌వేగాస్‌ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక సీఈఎస్‌ టెక్‌షో
X

అమెరికా లాస్‌వేగాస్‌ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక సీఈఎస్‌ టెక్‌షోలో అత్యాధునిక భవిష్యత్‌తరం టెలివిజన్లను దిగ్గజ సంస్థలు ప్రదర్శించాయి. గాజుముక్కలా.. ఒకవైపు నుంచి చూస్తే మరోవైపు కనిపించే పారదర్శక టీవీలు ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ అయిన ఎల్జీ.. ప్రపంచంలోనే తొలిసారిగా వైర్‌లెస్‌ ట్రాన్స్‌పరెంట్‌ OLED టీవీని లాంచ్‌ చేసింది. అందులో ప్లే చేసిన కంటెంట్‌ను చూస్తే అవాక్కవ్వాల్సిందే. గాలిలోనే అందులోని కంటెంట్‌ కదులుతోందా అన్న అనుభూతిని కలిగిస్తోంది ఆ టీవీ. గాజుపై ఆర్గానిక్‌ మెటీరియల్‌ను ముద్రించి దీన్ని రూపొందించినట్లు ఎల్జీ తెలిపింది. టీవీ ఆఫ్‌ చేసినప్పుడు టీవీ వెనుకవైపు ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇదే షోలో దక్షిణకొరియా దిగ్గజ సంస్థ సామ్‌సంగ్‌ కూడా కృత్రిమ మేథతో కూడిన సరికొత్త టీవీని ఆవిష్కరించింది. ఏఐ చిప్‌సెట్‌ను అమర్చిన సామ్‌సంగ్‌ నియో QLED 8కే ఏఐ స్క్రీన్‌ టీవీని లాంచ్‌ చేసింది. ఈ టీవీతో విద్యుత్‌ వినియోగం గణనీయంగా తగ్గుతుందని సామ్‌సంగ్‌ తెలిపింది. ఇంట్లో ఉన్న ఫోన్లు, అలెక్సా, సిరి వంటి అసిస్టెంట్లను అన్నిటినీ దీంతో కనెక్ట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇందులో ఉన్న ఏఐ స్క్రీన్‌ టెక్నాలజీ.. పిక్చర్‌ను క్రిస్టల్‌ క్లియర్‌గా చేస్తుందని తెలిపింది. వేగంగా కదులుతున్న దృశ్యం, ఉదాహరణకు బాల్‌ కదులుతున్న వీడియో ప్లే ఐతే.. ఏఐ దాన్ని ఫోకస్‌ చేసి ట్రాక్‌ చేస్తూ బ్లర్‌ లేకుండా క్రిస్టల్-క్లియర్ క్లారిటీ పిక్చర్‌ను అందిస్తుంది.


మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లేలను కూడా సామ్‌సంగ్‌ ప్రదర్శించింది.అది చూసేందుకు పారదర్శక గాజుముక్కలా కనిపిస్తోంది.సీఈఎస్‌ షోలో టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలను లాంచ్‌ చేస్తారు. పదేళ్ల క్రితం స్మార్ట్‌వాచ్‌లను తొలిసారి ఈ షోలోనే ప్రదర్శించారు. వంటసామాగ్రి నుంచి క్రీడా వస్తువులు, సాఫ్ట్‌వేర్లు, వర్చువల్‌ రియాలిటీ, రోబోలు, ఈవీలు ఇలా పలు నవీన ఆవిష్కరణలను లాంచ్‌ చేశారు. స్మార్ట్‌గా ఏఐతో పనిచేసే టచ్‌స్క్రీన్‌ కుకింగ్‌ గ్రిల్‌ను సోనీ కంపెనీ ప్రవేశపెట్టింది.

ఎలియోజ్ అనే ఫ్రెంచి సంస్థ చాట్‌జీపీటీ వంటి సైన్‌ బాట్‌ను రూపొందించింది. సాధారణంగా అలెక్సా వంటివి వాయిస్‌ అసిస్టెంట్లతో పనిచేస్తాయి. అయితే ఈ సైన్‌బాట్‌లో ఉండే అవతార్‌ సైన్‌లాంగ్వేజీని అర్థం చేసుకుని ప్రతిస్పందిస్తుంది.

Tags

Next Story