Huderabad : అశోక్‌నగర్‌లో గ్రూప్ 2 విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌లో పోటీపరీక్షలకు కేంద్రమైన అశోక్‌నగర్ ప్రాంతంలో హాస్టల్ గదిలో ప్రవలిక అనే యువతి ఆత్మహత్య స్థానికంగా తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. ఉద్యోగాలు రాకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే యువతి బలవన్మరణానికి పాల్పడిందంటూ వందలాది మంది విద్యార్థులు, అభ్యర్థులు రోడ్లపైకి చేరి ఆందోళనకు దిగారు. భాజపా, కాంగ్రెస్ నేతల మద్దతుతో పరిస్థితి చెయ్యి దాటిపోయింది. పలువురు నేతలను ఆరెస్ట్ చేసిన పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న ఓ అభ్యర్థిని హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. వరంగల్ జిల్లా బిక్కజిపల్లి మండలం పొనకల్ కు చెందిన మర్రి ప్రవళిక డిగ్రీ పూర్తి చేసింది. పోటీ పరీక్షలకు రాసేందుకు అశోక్‌నగర్ లోని ఓ కోచింగ్ సెంటర్‌లో చేరి శిక్షణ తీసుకుంటోంది. సమీపంలో ఉన్న బృందావన్ మహిళా వసతి గృహంలో అద్దెకు ఉంటోంది. 15 రోజుల క్రితమే ఈ హస్టల్ లో చేరిన ప్రవళిక నిన్న రాత్రి 8గంటల ప్రాంతంలో గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలన్మరణానికి పాల్పడింది. గమనించిన రూమ్ మేట్స్ యజమానులకు సమాచారం అందించారు. అప్పటికే ప్రవళిక మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తుండగా ప్రవళిక మృతికి ప్రభుత్వమే కారణం అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
వందలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, అభ్యర్థులు ఉద్యోగ నియామకాల్లో జప్యం జరగడం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుందని నినాదాలు చేశారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించకుండా అడ్డుకున్నారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళన చేస్తున్న వారికి కాంగ్రెస్, భాజపా నేతలు సంఘీభావం తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న భాజపా ఎంపీ లక్ష్మణ్ పోలీసుల వైఖరిపై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు అనిల్‌కుమార్ యాదవ్, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలు ఆందోళనకు మద్దతు పలికారు. ఒక దశలో ఆందోళన తీవ్ర ఉద్రిక్తలకు దారి తీయడంతో.... ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. విద్యార్థులు, రాజకీయ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అయినప్పటికీ ఆందోళన ఉద్ధృతం కావడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసి ముషీరాబాద్ ఠాణాకు తలించారు. కాంగ్రెస్ నేతలు ఫిరోజ్‌ఖాన్,
విజయారెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసుల దోమలగూడా ఠాణాకు తరలించారు. నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు అందోళన చేస్తున్నవారిని చెదరగొట్టారు. వారిపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో కొందరు పోలీసులపై రాళ్ళు రువ్వారు. ఇద్దరు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. హైదరాబాద్ ఏ ఆర్ ఏసీపీ సత్యనారాయణ కనుబొమ్మలపై గాయమైంది. మరో సబ్ ఇన్పెక్టర్‌కి సైతం స్వల్ప గాయాలు అయ్యాయి. విద్యార్ధులను చెదరగొట్టిన వెంటనే బృందావన్ హస్టల్ లో ఉన్న ప్రవళిక మృత దేహాన్ని భారీ భధ్రత నడుమ గాంధీ అస్పత్రికి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com