Kandula Sai Varshith: వీలైతే బైడెన్‌ను చంపాలనుకున్నా..

Kandula Sai Varshith:  వీలైతే బైడెన్‌ను చంపాలనుకున్నా..
నేరాన్ని ఒప్పుకున్న సాయి వర్షిత్‌

వైట్‌హౌస్‌ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి దాడి చేసిన కేసులో తెలుగు కుర్రాడు సాయివర్షిత్‌ కందుల నేరాన్ని అంగీకరించాడు. తన లక్ష్యం కోసం వీలైతే అధ్యక్షుడు బైడెన్‌ను చంపాలనుకున్నానని కోర్టు విచారణలో తెలిపాడు. గత ఏడాది మే 22న సాయి వర్షిత్‌ అద్దె ట్రక్కుతో వైట్‌హౌస్‌ వద్ద బీభత్సం సృష్టించాడు. వైట్‌హౌస్‌ భవనంలోకి వెళ్లి అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఈ దాడి చేశానని నిందితుడు విచారణలో తెలిపాడు. తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వీలైతే అధ్యక్షుడు బైడెన్‌ సహా ఇతరులను కూడా చంపాలని ముందుగానే ప్లాన్‌ చేసుకున్నట్టు చెప్పాడు. ఈ కేసులో నిందితుడు ఉద్దేశపూర్వకంగా ప్రజా ప్రభుత్వానికి హాని చేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్టు విచారణలో రుజువైందని యుఎస్‌ అటార్నీ తెలిపింది.

భారత సంతతికి చెందిన ఓ కుర్రాడు అమెరికాలో దారుణానికి ఒడిగట్టాడు. నాజీ సర్కారు తీసుకొచ్చేందుకు బైడెన్ కూడా చంపాలనుకున్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు. అతడు గతేడాది అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వద్ద ట్రక్కు తో దాడి చేసిన ఘటన తెలిసిందే. గతంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో నిందితుడైన భారత సంతతి కుర్రాడు 20 ఏళ్ల కందుల సాయి వర్షిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అతడు కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. బైడెన్‌ ప్రభుత్వాన్ని దించి.. నాజీ సర్కారును తీసుకొచ్చేందుకు తాను దాడికి పాల్పడ్డానని చెప్పినట్లు అటార్నీ తెలిపింది.

అసలేం జరిగిందంటే..మే 22 సాయంత్రం మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌ నుంచి సాయి వర్షిత్‌ వాషింగ్టన్‌ డీసీకి చేరుకున్నాడు. ఓ ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. వైట్‌హౌస్‌ వద్దకు వెళ్లి సైడ్‌వాక్‌పై వాహనాన్ని నడిపాడు. దీంతో పాదచారులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. అనంతరం శ్వేతసౌధం ఉత్తరభాగం వైపున భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ బారియర్స్‌ను ఢీకొట్టాడు. ఆ తర్వాత ట్రక్కును రివర్స్‌ చేసి మరోసారి ఢీకొట్టాడు. వాహనం నుంచి కిందకు దిగి నాజీ జెండాను పట్టుకుని నినాదాలు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. నేడు కోర్టులో హాజరుపరుచగా నిందితుడు తప్పు ఒప్పుకున్నాడు.

సాయి వర్షిత్ ఏమన్నాడంటే.. “ఈ దాడి కోసం చాలా కాలం నుంచే ప్లాన్‌ చేసుకున్నా. గతేడాది ఏప్రిల్‌లో వర్జీనియాలోని ఓ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థను సంప్రదించాను. 25 మంది సాయుధ సిబ్బంది, సాయుధ కాన్వాయ్‌ కావాలని కోరా. అది సాధ్యం కాకపోవడంతో ఇతర కంపెనీలను సంప్రదించా. ఓ పెద్ద కమర్షియల్‌ ట్రక్కును అద్దెకు తీసుకునేందుకు యత్నించా. అవి కుదరకపోవడంతో చివరకు U-Haul సంస్థ నుంచి చిన్నపాటి ట్రక్కును అద్దెకు తీసుకున్న. అని పేర్కొన్నాడు.

Tags

Next Story