Heat Wave : ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయిలో భానుడి భగభగలు..

Heat Wave :  ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయిలో భానుడి భగభగలు..
X
లానినా కొనసాగుతున్నా.. భిన్నమైన పరిస్థితులు

పొద్దుగాల తొమ్మిదింటికి బయటకెళ్లినా మాడు భగ్గుమంటున్నది. సాయంత్రమైనా భూమి సెగలు పొగలు కక్కుతున్నది. మే నెల వచ్చిందా? అని చూస్తే, క్యాలెండర్‌ మార్చి కూడా దాటలే. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల పరిస్థితి ఇలా ఉంది. భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మార్చి మొదటి నుంచే 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే ఏప్రిల్‌, మే నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం లానినా పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతుండటంపై నిపుణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వర్షకాలంలో సమృద్ధి వానలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా వాతావరణంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్టు చెప్తున్నారు.

వాతావరణంలో సంభవించే పరస్పర విరుద్ధ పరిణామాలనే ఎల్‌నినో, లానినాగా చెప్తారు. పసిఫిక్‌ మహా సముద్రం మధ్య, తూర్పు ప్రాంత ఉపరితలంలో ఏర్పడే ప్రత్యేక సముద్ర పవనాలు సాధారణంగా ఎల్‌నినో, లానినాకు కారణంగా పరిణమిస్తాయి. ఈ రెండింటినీ కలిపి ‘ఎల్‌నినో సదరన్‌ ఆసిలేషన్‌ (ఈఎన్‌ఎస్‌వో)’ వలయాలుగా పిలుస్తారు. ఈఎన్‌ఎస్‌వోలో ఉష్ణ దశను ఎల్‌నినో అని, చలి దశను లానినాగా పేర్కొంటారు. సాధారణ పరిభాషలో చెప్పాలంటే.. ఎల్‌నినో కారణంగా ఎండలు మండిపోతాయి. వర్షాలు తక్కువగా కురుస్తాయి. లానినా కారణంగా మంచి వానలు కురుస్తాయి. మన దేశంలో 70 శాతం వానలకు కారణమయ్యే నైరుతి రుతుపవనాలను కూడా ఈ ఎల్‌నినో, లానినాలే ప్రభావితం చేస్తాయి.

పసిఫిక్‌ మహాసముద్ర జలాల్లో ఏర్పడే ఈఎన్‌ఎస్‌వో వలయాలు ప్రతీ రెండు, మూడేండ్లకు ఒకసారి మారుతాయి. అంటే, ఒకసారి లానినా పరిస్థితులు ఉంటే, ఆ వచ్చే ఒకట్రెండేండ్లూ లానినానే ఉండి మంచి వర్షాలు కురుస్తాయి. ఎండల తీవ్రత తక్కువగా ఉంటుంది. అయితే, ఇందుకు భిన్నమైన పరిస్థితులు ప్రస్తుతం నమోదవుతున్నాయి. నిరుడు లానినా సైకిల్‌ మొదలైంది. అందుకే గత వానకాలం సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిశాయి. ఈ లెక్కప్రకారం లానినా ప్రభావం ఈసారి కూడా ఉండాలి. అంటే ఈసారి ఎండల తీవ్రత తక్కువగా నమోదవ్వాలి. అయితే అందుకు భిన్నంగా భానుడు ఫిబ్రవరి నుంచే నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు.

Tags

Next Story