Hindu Temple : అమెరికాలో మరో హిందూ ఆలయంపై దాడి..

అగ్రరాజ్యం అమెరికాలో హిందూ ఆలయాలపై దాడి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో ఆలయం గోడలపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాశారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలోని బాప్స్ శ్రీ స్వామి నారాయణ మందిరం పై ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆలయ గోడలపై హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు రాసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
బుధవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. ‘హిందూస్ గో బ్యాక్’ సందేశాలతో ఆలయాన్ని అపవిత్రం చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా అక్కడికి వెళ్లే నీటి పైపుల్ని సైతం ధ్వంసం చేసినట్లు తెలిపారు. శాంతి కోసం ప్రార్థనలతో ఇలాంటి విద్వేషాన్ని ఎదుర్కొంటామని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు శాక్రమెంటో పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఘటన నేపథ్యంలో స్థానిక హిందూలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయం వద్దకు చేరుకొని, ప్రార్థనల్లో పాల్గొన్నారు. శాంతి, ఐక్యత కోసం ప్రార్థించారు.
కాగా, పది రోజుల వ్యవధిలోనే ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం ఇది రెండోసారి. దీనికి ముందు న్యూయార్క్‌లోని బాప్స్ మందిరం వద్ద దుండగులు ఇదేవిధంగా ప్రవర్తించారు. అమెరికాలోని మెల్విల్లేలో ఉన్న బీఏపీఎస్ స్వామి నారాయణ్ దేవాలయంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది ఆమోదనీయం కాదని, అత్యంత హేయమైన చర్య అని న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com