Alaska Aircraft: అంతుచిక్కని అలస్కా ట్రయాంగిల్..తాజా ప్రమాదంలో పది మంది మృతి

పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనా లో పైలట్‌తో సహా పది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, విమానం శిథిలాలను సముద్రంలో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి మైక్ సలెర్నో రెస్క్యూ టీం తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. టేకాఫ్ అయిన గంటలోపే విమానం ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో సంబంధాలు కోల్పోయిందని అధికారులు చెప్పారు.
అలాస్కా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ప్రకారం, బెరింగ్ ఎయిర్‌కు చెందిన సెస్నా కారవాన్ అనే విమానం గురువారం ఉనల్కలేట్ నుంచి నోమ్ నగరానికి బయలుదేరింది. ఆ విమానంలో తొమ్మిది మంది ప్రయాణికులతో పాటు పైలట్ ఉన్నారు. అయితే, ప్రతికూల వాతావరణం వల్ల విమాన ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో హిమపాతం, పొగమంచు ప్రభావం అధికంగా ఉండటంతో పరిస్థితులు అత్యంత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. విమానం ప్రమాదానికి గల అసలు కారణాన్ని తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. ఇకపోతే, జనవరి 29న వాషింగ్టన్ సమీపంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ జెట్, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొని 67 మంది ప్రాణాలు కోల్పోయారు. జనవరి 31న ఫిలడెల్ఫియాలో ఓ రవాణా విమానం కూలిపోయి ఆరుగురు మరణించారు. ఇక, ప్రస్తుతం అలాస్కాలో ఈ ప్రమాదం జరిగింది.
అంతుచిక్కని అలస్కా ట్రయాంగిల్..
అమెరికాలోని అలస్కా ట్రయాంగిల్ ఒక అంతుచిక్కని ప్రదేశం. అక్కడ పర్యటించే వేలాది మంది జాడ కూడా దొరకదు. ఈ ప్రాంతంపై నుంచి ప్రయాణించే విమానాలు గల్లంతవుతున్నాయి. అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో యాంకరేజ్, జునేయు, ఉట్కియాగ్వి మధ్య త్రికోణాకారంలో విస్తరించి ఉన్న ప్రాంతాన్ని అలస్కా ట్రయాంగిల్ అంటారు. ఎత్తయిన మంచుకొండలతో ఉన్న ఈ ప్రాంతంలో 1972 నుంచి పలు విమానాలు జాడ కోల్పోయాయి. ఈ ప్రాంతంలో పర్యటించే వేలాది మంది పర్యటకులు ప్రతియేటా గల్లంతవుతున్నారు.
రోజుల తరబడి సాగే సెర్చ్ ఆపరేషన్లు విఫలమవుతున్నాయి. ఎంత వెతికినా గల్లంతైన వారి ఆచూకీ దొరకడం లేదు. 1972 నుంచి ఇప్పటివరకు అలస్కా ట్రయాంగిల్‌లో దాదాపు 20 వేల మంది ఆచూకీ లభించలేదు. ప్రతియేటా సగటున 2,250 మంది ఇక్కడ గల్లంతవుతున్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ప్రతికూల వాతావరణమో, భౌగోళిక పరిస్థితుల ప్రభావమో కానీ అలస్కా ట్రయాంగిల్ అంటేనే అమెరికన్లలో ఒక ఆందోళన కలుగుతుంది. దీనిపైన టీవీ షోలు, డాక్యుమెంటరీలు సైతం తెరకెక్కాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com