IDF:అతిపెద్ద హమాస్ టన్నెల్ .. 4 కిలోమీటర్ల మేర నెట్‌వర్క్

IDF:అతిపెద్ద హమాస్ టన్నెల్ .. 4 కిలోమీటర్ల మేర నెట్‌వర్క్
వాహనాలు కూడా ప్రయాణించెంత పెద్దది

హమాస్‌ వాడిన గాజాలోనే అతిపెద్ద సొంరంగాన్ని ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు గుర్తించాయి. తమ దళాలు చేపట్టిన భూతల ఆపరేషన్‌లో భాగంగా...... దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించిన సొరంగాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్‌ పేర్కొంది. వాహనాలు కూడా ప్రయాణించేలా హమాస్‌ దీనిని నిర్మించినట్లు వెల్లడించిన ఇజ్రాయెల్‌ సొరంగానికి సంబంధించిన వీడియోలను విడుదల చేసింది.

హమాస్‌ నిర్మించిన పలు సొరంగాలను ఇప్పటికే బహిర్గతం చేసిన ఇజ్రాయెల్‌ తాజాగా గాజాలోనే అతిపెద్ద సొరంగాన్ని గుర్తించింది. గాజాలో హమాస్‌ దళాలు వాడిన.. అతిపెద్ద సొరంగాన్ని ఇజ్రాయెల్‌ రక్షణ దళం-డిఫ్ బహిర్గతం చేసింది. తమ దళాలు చేపట్టిన భూతల ఆపరేషన్‌లో భాగంగా ఈ సొరంగాన్ని గుర్తించినట్లు ఐడీఎఫ్‌ తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఐడీఎఫ్‌ విడుదల చేసింది. హమాస్‌ దాదాపు నాలుగు కిలోమీటర్ల పొడవున దీనిని నిర్మించినట్లు వెల్లడించింది. కొన్నిచోట్ల ఈ సొరంగం భూగర్భంలో 50 మీటర్ల లోతుకు చేరినట్లు పేర్కొంది. వాహనాలు కూడా ప్రయాణించేలా దీనిని నిర్మించారని వివరించింది. గాజాలోని సొరంగాల నిర్మాణ వీడియోలు కూడా తమ చేతికి చిక్కినట్లు ఐడీఎఫ్‌ తెలిపింది. టన్నెల్‌ బోరింగ్‌ యంత్రాలను కూడా హమాస్‌ వాడినట్లు తెలుస్తోందని చెప్పింది. ఈ అతిపెద్ద సొరంగం ఉత్తర గాజా నుంచి... ఇజ్రాయెల్‌ సరిహద్దుల్లోని ఎరెజ్‌ బోర్డర్‌ క్రాసింగ్‌ వరకు ఉన్నట్లు వెల్లడించింది. వాస్తవానికి పాలస్తీనా వాసులు వైద్యం, ఉపాధి నిమిత్తం ఈ క్రాసింగ్‌ నుంచే ఇజ్రాయెల్‌లోకి ప్రవేశిస్తుంటారు. ప్రస్తుతం దీనిని మూసివేశారు. అక్టోబర్‌ 7 జరిగిన దాడికి సన్నాహకంగా ఆయుధ సామాగ్రిని తరలించడానికి, హమాస్ దళాలు వాహనాల ద్వారా ప్రయాణించడానికి రవాణాను ఈ సొరంగం సులభతరం చేసిందని ఐడీఎఫ్‌ వెల్లడించింది.

ఈ సొరంగం నేరుగా కాకుండా చాలా మార్గాల్లోకి విస్తరించివుండటాన్ని చూసి తాము విస్తుపోయినట్లు ఇజ్రాయెల్‌ దళాలు పేర్కొన్నాయి. పలు కూడళ్లు కూడా దీనిలో ఉన్నాయని సొరంగంలో చాలా భాగాల్లో విద్యుత్తు సరఫరా వ్యవస్థ ఏర్పాట్లు, ప్లంబింగ్‌ వర్క్‌ జరిగిందని తెలిపాయి. దీనిలో చాలా తలుపులకు పేలుడు పదార్థాలను అమర్చినట్లు ఐడీఎఫ్ గుర్తించింది. దీనిలో భారీ ఎత్తున నిల్వ ఉంచిన హమాస్‌ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుంది. గాజాలో తాము చేపట్టిన భూతల ఆపరేషన్‌ కారణంగా హమాస్‌ టన్నెల్‌ నెట్‌వర్క్‌ గురించి చాలా విషయాలు తెలిశాయని ఐడీఎఫ్‌ పేర్కొంది. ఈ సొరంగాల నిర్మాణం కోసం దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ నగరం నుంచి డజన్ల కొద్దీ నిపుణులను హమాస్‌ ఉత్తర గాజాకు తరలించినట్లు.. ఆరోపించింది. హమాస్‌ నాయకుడు యాహ్యా సిన్వార్‌ సోదరుడు మహమ్మద్‌ ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించాడని ఐడీఎఫ్‌ పేర్కొంది. ఓ సొరంగంలో అతడు వాహనాన్ని డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళుతున్న వీడియోను ఐడీఎఫ్‌ విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story