King Charles: కింగ్ చార్లెస్‌కు క్యాన్సర్ చికిత్స

బ్రిటన్ రాజు చార్లెస్‌కు (Charles) క్యాన్సర్ నిర్ధారణ అయిందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. పలు దేశాధినేతలు చార్లెస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే చార్లెస్‌కు చికిత్స ప్రారంభమైందని కింగ్ త్వరగా కోలుకుని ప్రజా జీవితంలోకి వస్తారని బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటించింది. ఈ చికిత్స కారణంగా కింగ్ రోజువారి అధికారిక కార్యకలాపాలకు దూరంగా ఉండనున్నారు.
క్యాన్సర్‌తో బాధపడుతున్న బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి చికిత్స ప్రారంభించినట్లు బకింగ్‌హాం ప్యాలెస్ తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 17న.... కింగ్ చార్లెస్ అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించామని వివరించింది. జనవరి 26న పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స ప్రారంభించగా కింగ్ ఆరోగ్యంగానే ఉన్నారని క్వీన్ కెమిల్లా (Queen Camilla) ప్రకటించారు. మూడు వారాల పాటు కింగ్ చార్లెస్ ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. అనంతరం జనవరి 29న.. కింగ్ చార్లెస్ లండన్ ఆస్పత్రి నుంచి ప్యాలెస్‌కు చేరుకున్నారు. రోజువారీ అధికారిక విధులకు కింగ్ చార్లెస్... అప్పటినుంచి దూరంగానే ఉంటున్నారు. ఫిబ్రవరి నాలుగున కింగ్ చార్లెస్ దంపతులు సాండ్రింగ్‌హామ్‌లోని చర్చికి హాజరయ్యారు. ప్రొస్టేట్‌కు చికిత్స ప్రారంభించిన తర్వాత ఆ రోజునే కింగ్ బయటకు వచ్చి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు కూడా కింగ్ చాలా ముబావంగా కనిపించారు. అయితే ఫిబ్రవరి అయిదున కింగ్ చార్లెస్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. అయితే అది ప్రొస్టేట్ క్యాన్సర్ కాదని ప్రకటించిన ప్యాలెస్.... అది ఏ రకమైన క్యాన్సర్ అనేది మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. కింగ్ ఛార్లెస్ సోమవారం నుంచి పూర్తి స్థాయిలో చికిత్స తీసుకుంటున్నారు... క్యాన్సర్‌ను జయించి ఆయన త్వరగానే సాధారణ విధుల్లోకి వస్తారని బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కొంది.
కింగ్ చార్లెస్ వీలైనంత త్వరగా పూర్తి విధుల్లోకి రావాలనుకుంటున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది. చికిత్స సమయంలో బహిరంగ కార్యక్రమాలకు రోజువారీ కార్యకలాపాలకు కింగ్ దూరంగా ఉండనున్నారని ప్యాలెస్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన హాజరయ్యే అధికారిక కార్యక్రమాలు ఇతర సీనియర్ రాజ కుటుంబీకులు నిర్వర్తించనున్నారు. కానీ కింగ్ రాజ్యాంగబద్దమైన విధులు మాత్రం నిర్వహిస్తారని వెల్లడించారు. చికిత్స చేస్తున్న వైద్య బృందానికి కింగ్ ధన్యవాదాలు తెలిపారని.. తన చికిత్స గురించి చార్లెస్ పూర్తిగా సానుకూలంగా ఉన్నారని..బకింగ్‌హామ్ ప్యాలెస్ (Buckingham Palace) వెల్లడించింది. ఊహాగానాలను అ్డడుకట్ట వేయడానికే కింగ్ తనకు క్యాన్సర్ సోకిందన్న విషయాన్ని బహిర్గతం చేశారని వివరించింది. క్యాన్సర్‌పై మరింత అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే కింగ్ ఈ ప్రకటన చేశారని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది.
క్యాన్సర్‌తో బాధపడుతున్న కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ ఆకాంక్షించారు. ఆయన త్వరగా కోలుకొని పూర్తి శక్తితో తిరిగి వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని సునాక్ ట్వీట్ చేశారు. కింగ్ త్వరగా కోలుకోవాలనిత్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మర్ ఆకాంక్షించారు. క్యాన్సర్ చికిత్సకు ఆశ, ధైర్యం అవసరమని.. ఆ రెండు ఉన్న కింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభిలాషించారు. కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కింగ్ ఛార్లెస్‌కు క్యాన్సర్ సోకిందన్న వార్తలతో బ్రిటన్‌లోని పత్రికలు నిండిపోయాయి. ప్రధాన పత్రికలు ఈ వార్తను పతాక శీర్షికతో ఇచ్చాయి. ది మిర్రర్, ది టైమ్స్, ది గార్డియన్ పత్రికలు సహా చాలా వార్తా సంస్థలు కింగ్ వార్తను ప్రముఖంగా ఇచ్చాయి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com