40 రోజుల తర్వాత బ్రతికిబయట పడ్డ చిన్నారులు

40 రోజుల తర్వాత  బ్రతికిబయట పడ్డ చిన్నారులు
చిన్నారులు ఏకంగా 40 రోజుల పాటు ఆ అడవుల్లో సంచరించారు. భయంకర విమాన ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు బాలలు.. అడవిలో దొరికే ఆకులు అలములు తింటూ, అమెజాన్‌ చిత్తడి నేలల్లోని నీటిని తాగుతూ.. ప్రాణాలు కాపాడుకున్నారు.

అమేజాన్ అడవుల్లో మహాద్భుతం జరిగింది... కాకులు దూరని కారడవిలో, చీమలు దూరని చిట్టడవిలో.. క్రూరమృగాలు, విషపురుగుల మయమైన మహారణ్యంలో అడుగు పెట్టాలంటేనే భయమేస్తుంది. అలాంటిది.. చిన్నారులు ఏకంగా 40 రోజుల పాటు ఆ అడవుల్లో సంచరించారు. భయంకర విమాన ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు బాలలు.. అడవిలో దొరికే ఆకులు అలములు తింటూ, అమెజాన్‌ చిత్తడి నేలల్లోని నీటిని తాగుతూ.. ప్రాణాలు కాపాడుకున్నారు. వీరిలో 11 నెలల పసిబిడ్డ కూడా ఉంది. మిగతా ముగ్గురు 13, 9, 4 ఏళ్ల వయస్సువారు. ఇన్నిరోజుల తర్వాత వీరంతా అడవిలో సజీవంగా కనిపించడం ఒక అద్భుతమే. 40 రోజుల తర్వాత చిన్నారులు సజీవంగా తిరిగి రావడంతో.. దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశంలో ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు.

అమెజాన్‌ అటవీ ప్రాంతంలోని ఆరారాక్యూరా నుంచి శాన్‌జోస్‌ డెల్‌ గ్వావియారే ప్రాంతానికి మే ఒకటో తేదీన ఓ విమానం బయలుదేరింది. అందులో నలుగురు చిన్నారులు, వారి తల్లి, గైడ్‌, పైలట్‌ ఉన్నారు. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక సమస్యతో అది కూలబోతున్నట్లు పైలట్‌ ప్రకటించాడు. అనంతరం ఆ విమానం రాడార్‌ నుంచి అదృశ్యమైంది. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు సైన్యాన్ని రంగంలోకి దింపారు. ‘ఆపరేషన్‌ హోప్‌’ పేరిట దట్టమైన అడవుల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత మే 16న విమాన శకలాలను గుర్తించారు. అందులో పైలట్‌, చిన్నారుల తల్లి, గైడ్‌ మృతదేహాలను గుర్తించారు. అదే విమానంలో తల్లితోపాటు ప్రయాణించిన నలుగురు చిన్నారులు కనిపించలేదు. దీంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దాదాపు 150 మంది సైనికులు, జాగిలాలతో ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి నాలుగైదు కిలోమీటర్ల పరిధిలో అడవిని జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే మే 18వ తేదీన పిల్లలు క్షేమంగానే ఉన్నారని తెలియజేసేలా చిన్న గుడారం, జుట్టుకు కట్టుకునే రిబ్బన్‌, పాలసీసా, సగం తిన్న పండు వంటివి కనిపించాయి. దీంతో పిల్లలు బతికే ఉన్నట్లు ధ్రువీకరించిన అధికారులు వారి కోసం గాలింపు చర్యలను మరింతగా పెంచారు.

మొత్తానికి... ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత చిన్నారులను సజీవంగా గుర్తించారు. గాలింపు సమయంలో భద్రతా సిబ్బంది అడవుల్లో అక్కడక్కడా హెలికాప్టర్ల సాయంతో ఆహార పదార్థాలు ఉన్న బాక్సులను జారవిడిచారు. ఆ ఆహారమే చిన్నారుల ఆకలి తీర్చి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు, ఇన్ని రోజుల తర్వాత చిన్నారులు సజీవంగా కనిపించడంతో కొలంబియా వాసుల ఆనందానికి అవధుల్లేవు. సైనికులతో చిన్నారులు ఉన్న చిత్రాలను కొలంబియా సైన్యం ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. గాలింపు బృందాలు వారి వద్దకు చేరుకునే సరికి నలుగురు పిల్లలు ఒంటరిగానే ఉన్నట్లు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు. అడవే వారిని రక్షించింది. వారు అడవి పిల్లలు.. కొలంబియా వారసులంటూ సంతోషం వ్యక్తం చేశారు. అమెజాన్‌ మహారణ్యం నుంచి బయటపడ్డ చిన్నారులకు ప్రస్తుతం వైద్య చికిత్స అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story