Maldives: మాల్దీవులకు భారీగా తగ్గిన భారత పర్యటకులు

మాల్దీవుల్లోని పర్యాటక కేంద్రాలు బోసిపోతున్నాయి. భారత్ నుంచే వెళ్లే పర్యాటకులు తగ్గటమే అందుకు కారణమని తెలుస్తోంది. 2023, 2024 సంవత్సరాల్లో మార్చి నెలవరకు మాల్దీవులకు వెళ్లే భారతీయుల సంఖ్య 33శాతం తగ్గింది. భారత్‌తో దౌత్య వివాదం మొదలైన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే చైనా నుంచి మాల్దీవులకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతున్నట్లు సమాచారం మాల్దీవులను సందర్శించే భారతీయుల సంఖ్య గతేడాదితో పోలిస్తే 33శాతం తగ్గినట్లు తెలుస్తోంది.
మాల్దీవుల మంత్రులు ప్రధాని మోదీతోపాటు భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇరమదేశాల మధ్య దౌత్య వివాదం మొదలైంది. అప్పటి నుంచి మాల్దీవుల సందర్శనను భారతీయ పర్యాటకులు బాయ్‌కాట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి పర్యాటక శాఖ నివేదిక వివరాలను ఓ వెబ్‌సైట్ బయటపెట్టింది. గతేడాది మార్చి వరకు మాల్దీవులను 41వేల 54 మంది భారత పర్యాటకులు సందర్శిస్తే ఈ ఏడాది మార్చి 2వ తేదీవరకు ఆ సంఖ్య 27వేల 224కు తగ్గినట్లు వెబ్‌సైట్ వెల్లడించింది. అంటే 13వేల 830 మంది భారతీయ పర్యాటకులు తగ్గినట్లు తెలిపింది. గతేడాది మార్చివరకు మాల్దీవుల పర్యాటకంలో 10శాతం వాటాతో భారత్ రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉండేది. అయితే ఈ ఏడాది మార్చివరకు మాల్దీవుల పర్యాటకంలో భారత్ వాటా 6శాతానికి పడిపోయింది. ఫలితంగా రెండోస్థానం నుంచి ఆరుకు పడిపోయినట్లు వెబ్‌సైట్ వెల్లడించింది.
భారతీయుల బాయ్‌కాట్ పిలుపు మాల్దీవుల పర్యాటకంపై ఏ మేరకు ప్రభావం చూపిందో తెలుసుకునేందుకు అక్కడి ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్ల సంఘం ఓ సర్వే నిర్వహించినట్లు వెబ్‌సైట్ తెలిపింది. అయితే ఆ వివరాలను బహిర్గతం చేయలేదని పేర్కొంది. కాగా 2021 నుంచి 2023 దాకా మాల్దీవుల పర్యాటకంలో భారతీయులే టాప్‌లో ఉండేవారు. ఏడాదికి 2లక్షల మంది పర్యాటకులు భారత్ నుంచి వెళ్లేవారు. దౌత్యవివాదం కొనసాగుతున్న వేళభారత్ స్థానాన్ని చైనా ఆక్రమించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 54వేలమంది చైనీయులు...మాల్దీవుల్లో పర్యటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com