IMRAN KHAN: మరోసారి ఇమ్రాన్‌ఖాన్ సంచలన ఆరోపణలు
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైల్లో పెట్టేందుకు షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ప్రణాళిక రచించిందని ఆరోపించారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రజలకు తెలిపారు. నిరాధారమైన కేసుల ఆధారంగా తనను అరెస్టు చేయడానికి ఎలా ప్లాన్ చేశారో దేశం తెలుసుకోవాలని అన్నారు. తనను బహిరంగంగా విచారిస్తే ప్రభుత్వ కుట్రను నిరూపిస్తానని సవాల్ విసిరారు. క్వెట్టాలో జరిగిన న్యాయవాది హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. తనకు ఈ హత్యతో సంబంధం ఉందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఇమ్రాన్ అన్నారు. చనిపోయిన వ్యక్తి భార్య.. వాస్తవాలేంటో ఇప్పటికే చెప్పందని అయినా తనపై కుట్ర జరుగుతూనే ఉందని విమర్శించారు.
పాక్‌లో చాలామంది అమయాకులను కాల్చి చంపుతున్నారని ఇమ్రాన్ అన్నారు. తన అరెస్ట్ సమయంలో 16 మంది అమాయక పాకిస్థానీలను కాల్చి చంపారని... తొమ్మిది మంది ఎక్కడ ఉన్నారో ఇంతవరకు తెలీదని అన్నారు. ఫ్రాన్స్‌లో కేవలం ఒక్క యువకుడిని చంపినందుకు ఎలా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయో గుర్తించాలని పాక్ ప్రజలను కోరారు. ఇదంతా రాజకీయం కాదనీ.. నిజమైన ప్రజాస్వామ్యం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ఉగ్రవాద పాలనను అంతం చేసేందుకు పీటీఐ జెండాను ఎగరేద్దామని సూచించారు. పాకిస్తాన్ ప్రభుత్వం దేశంలోని అన్ని సంస్థలను నాశనం చేసిందని ఇమ్రాన్ ఆరోపించారు. అల్-ఖాదిర్ కేసు, తోషాఖానా కేసు, భూ కుంభకోణం వంటి కేసులు తనపై మోపారని తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తన భార్య, సోదరిపై కూడా అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
మంద బుద్ధిగల వాళ్ల కింద బతుకడం కంటే చావడానికే తాను సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యానించారు. మీరు సిద్ధంగా ఉన్నారా.. అని పాక్ ప్రజలను ప్రశ్నించారు. దేశంలో ఎన్నికల సమయం దగ్గర పడటంతో తనను ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని షెబాజ్ షరీఫ్ సర్కారు కుట్ర పన్నిందని విమర్శించారు. తనకు విదేశాలకు వెళ్లే ఆలోచన తనకి లేదని వెల్లడించారు. ఎందుకంటే తనకు విదేశాలలో ఎటువంటి ఆస్తులు, వ్యాపారాలు లేవని... కనీసం దేశం వెలుపల బ్యాంకు ఖాతా కూడా లేదని అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com