Nepal prison: పారిపోతున్న ఖైదీలపై ఆర్మీ కాల్పులు..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన్ జడ్ నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల మాటున దేశ వ్యాప్తంగా ఉన్న జైళ్ల నుంచి ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై ఆర్మీ కాల్పులు జరిపింది.
గురువారం ఉదయం రామెచాప్ జిల్లా జైలు నుంచి ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారు. జైలు గేట్లను బద్దలు కొట్టి తప్పించుకునేందుకు యత్నించారు. అప్రమత్తమైన సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 12 మంది గాయపడ్డారు. వారికి వైద్యచికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ జైలులో దాదాపు 300 మందికిపైగా ఖైదీలు ఉన్నారు. ఖైదీలందరినీ అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమాలపై నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా జన్-జడ్ నిరసనకారులు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసనలు చెలరేగినప్పటి నుంచి దేశవ్యాప్తంగా పలు జైళ్ల నుంచి వేలాది మంది ఖైదీలు తప్పించుకున్నారు. కాఠ్‌మాండూ, పోఖరా, లలిత్‌పుర్‌లోని జైళ్ల నుంచి దాదాపు 15,000 మందికిపైగా ఖైదీలు పారిపోయారు.
బాంకే జువెనైల్ రిఫార్మ్ సెంటర్ నుంచి 122 మంది, బాంకే జిల్లా జైలు నుంచి 436 మంది, కాఠ్మాండూ లోయలోని సుందరలో గల సెంట్రల్ జైలు నుంచి 3,300, లలిత్‌పుర్‌లోని నక్కు జైలు నుంచి 1,400 మంది, దిల్లిబజార్ జైలు నుంచి 1,100 మంది ఉన్నారు. మహోత్తర జలేశ్వర్ జైలు నుంచి 575, సున్‌సారీలోని ఝుమ్కా జైలు నుంచి 1,575, చిత్వాన్ జైలు నుంచి 700 మంది, కపిల్ వాస్తు జిల్లా జైలు నుంచి 459 మంది, కైలాలి జైలు నుంచి 612 మంది, కాంచన్‌పూర్ జైలు నుంచి 478, సింధులి జైలు నుంచి 500 మంది ఉన్నారు. తప్పించుకున్న ఖైదీలు సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారు. కొందరు భారత్‌వైపు రాగా.. వారిని భారత సాయుధ పోలీసుదళం సశస్త్ర సీమా బల్ (SSB) పట్టుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ సమీపంలో 22 మంది నేపాలీ ఖైదీలను అడ్డుకున్నట్లు ఎస్‌ఎస్‌బీ అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com