USA: అమెరికాలో కాల్పుల కలకలం..ముగ్గురు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి జాత్యాహంకారం అమాయకులను కాటేసింది. ఫ్లోరిడా రాష్ట్రంలో జాక్సన్‌విల్లెలో ఉన్న డాలర్ జనరల్ స్టోర్ వద్ద ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు నల్లజాతీయులు మృతిచెందారు. మరణించిన వారిలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. జాత్యాహంకారంతోనే దుండగుడు వారిపై కాల్పులు జరిపినట్లు జాక్సన్‌విల్లె పోలీసులు తెలిపారు.
శనివారం మధ్యాహ్నం ఏఆర్-15 స్టైల్ రైఫిల్‌తో పాటు మరో హ్యాండ్‌గన్‌తో స్టోర్ వద్దకు వచ్చిన దుండగుడు పార్కింగ్ ప్రాంతంలో కనిపించిన నల్లజాతీయులపై కాల్పులు జరిపాడు. వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ముగ్గురిని హతమార్చిన తరువాత హంతకుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హంతకుడు వయస్సు 20ఏళ్లుగా పోలీసులు గుర్తించారు.
జాక్సన్‌విల్లేలో కాల్పులు జరిగిన ప్రాంతంలో నల్లజాతీయులు ఎక్కువగా నివాసం ఉంటారు. ఎడ్వర్డ్ వాటర్స్ యూనివర్సిటీ సమీపంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిపిన వ్యక్తి స్థానికుడు కాదని, చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకుముందు హంతకుడు తన తండ్రికి ఫోన్ చేసి తన కంప్యూటర్‌లో మెస్సేజ్‌ను తనిఖీ చేయాలని కోరాడు. కంప్యూటర్‌లో అభ్యంతరకర కంటెంట్ ను చూసిన తండ్రి వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. అయితే, అప్పటికే కాల్పుల ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
అటు రెండు రోజుల క్రితం దక్షిణ కాలిఫోర్నియా రాష్ట్రంలోని ట్రబుకో కాన్యన్‌లో జరిగిన కాల్పుల్లో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన బైకర్ బార్ అనే ప్రదేశంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. బైకర్ బార్ మోటార్‌సైకిల్ రైడర్‌లకు వినోద కేంద్రంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆరెంజ్ కౌంటీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులపై కూడా దుండగుడు కాల్పులు జరపడంతో…పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. ఈ ఘటనలో పోలీసులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. కాల్పులు జరిపిన వ్యక్తి రిటైర్డ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ గా పోలీసులు గుర్తించారు. అతను తనకు తెలిసిన వారిని లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పుల జరిపినట్లు అనుమానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com