United Airlines plane: విమానం గాల్లో ఉండగా ఊడిపోయిన టైరు

United Airlines plane: విమానం గాల్లో ఉండగా ఊడిపోయిన టైరు
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

అమెరికాకు చెందిన విమానయానసంస్థ యూనిటైడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 777 విమానం ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. శాన్‌ ఫ్రాన్సిస్కో నుంచి టేకాఫ్‌ అయిన కొద్దినిమిషాలకే విమానం ఎడమభాగంలోని చక్రం ఊడిపోయింది. వెంటనే విమానాన్ని పైలెట్లు లాస్‌ ఏంజిల్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి దారి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి జపాన్‌కు బయలుదేరిన యునైటైడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 777 విమానానికి పెను ప్రమాదం తప్పింది. శాన్‌ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కాసేపటికే విమానంలో ఎడమ వైపున ల్యాండింగ్‌ గేర్‌ వద్ద ఉన్న చక్రం ఊడిపోయింది. దీంతో పైలెట్లు లాస్‌ ఏంజిల్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫ్లైట్‌ను దారి మళ్లించారు. ల్యాండింగ్‌ సమయంలో విమానంలో మంటలు చెలరేగితే అదుపు చేయడానికి లాస్‌ ఏంజిల్స్‌ విమానాశ్రయంలో అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచారు. పైలెట్లు విమానాన్ని చాకచక్యంగా రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే విమాన చక్రం శాన్‌ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలోని పార్కింగ్‌ కేంద్రంలో ఉన్న ఓ కారుపై పడటంతో అది ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

విమానంలోని టైర్లకు నష్టం జరిగినా లేదా ఊడిపోయిన సురక్షితంగా ల్యాండ్‌ అయ్యేటట్లు దాన్ని నిర్మించారని విమానయాన సంస్థ యునైటైడ్‌ ఎయిర్‌లైన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి చేర్చుతామని పేర్కొంది. బోయింగ్‌ 777 విమానాలకు కుడి, ఎడమ భాగాల్లోని మెయిన్‌ ల్యాండింగ్‌ గేర్ల వద్ద పన్నెండు టైర్లు ఉంటాయి. ఈ ఘటనపై ఫెడరల్‌ ఏవియేషన్‌ విభాగం దర్యాప్తు చేపడుతుందని అధికారులు తెలిపారు. జనవరిలో కూడా అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737-9 మ్యాక్స్‌ విమానం గాల్లో ఉండగా అత్యవసర ద్వారం ఊడిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story