ఈ జలాంతర్గామిలో ప్రయాణమే నిజమైన సవాల్‌

ఈ జలాంతర్గామిలో ప్రయాణమే నిజమైన సవాల్‌
అందరి చూపు టైటాన్‌ సబ్‌మెరైన్‌పైనే... కనీసం కూర్చోడానికి సీట్లు , బాత్రూమ్ కూడా లేని సబ్‌మెరైన్‌..

ఇప్పుడు ప్రపంచంలోని అందరి చూపు అట్లాంటిక్‌ మహా సముద్రంలో గల్లంతైన టైటాన్‌ సబ్‌మెరైన్‌పైనే ఉంది. అందులోని కుబేరులను క్షేమంగా బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్‌లు కాలంతో పోటీ పడుతూ పరుగులు పెడుతున్నాయి. 1912లో అట్లాంటిక్‌ మహా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్‌ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లి... అయిదుగురు సందర్శకులు ఉన్న మినీ జలాంతర్గామి అదృశ్యమైంది. అందులోని సందర్శకులు క్షేమంగా బయటపడాలని ప్రపంచం ప్రార్థిస్తోంది. అసలు సముద్ర అగాథంలోకి వెళ్లాలంటే చాలా కష్టతరమైన పని. అలా వెళ్లేందుకు చేసిన ఈ మినీ జలాంతర్గామి ఎలా ఉంటుందో తెలిస్తే ఔరా అనిపించాల్సిందే. ఈ మినీ జలాంతర్గమిలో కూర్చుంటే...... 9 అడుగుల వెడల్పు... 8 అడుగుల పొడవు ఉన్న 22 అడుగుల పొడవైన బాక్స్‌లో కూర్చున్నట్లు ఉంటుంది. సబ్ మెర్సిబుల్ సముద్రంలోకి దిగడానికి ముందుగా వాహనంలోకి యాత్రికులు వెళ్లిన తర్వాత సహాయక సిబ్బంది బయట నుంచి సబ్ మెర్సిబుల్‌ను బోల్టులతో బిగించి లాక్‌ చేస్తారు. టైటాన్ సబ్ మెర్సిబుల్ బరువు 10 వేల 342 కేజీలు ఉంటుంది. సముద్ర మట్టానికి దిగువన 4 వేల మీటర్ల లోతు వరకు ఈ సబ్ మెర్సిబుల్ చేరుకోగలదు. సబ్‌మెరైన్‌ల తరహాలో కాకుండా సబ్ మెర్సిబుల్స్‌కు పరిమిత శక్తి నిల్వలు ఉంటాయి. లోపలి భాగం చాలా ఇరుకుగా ఉంటుంది. ఇందులో కేవలం అయిదుగురు మాత్రమే ప్రయాణించవచ్చు. ఇందులో స్వేచ్ఛగా అటూ ఇటూ తిరగడం కూడా కష్టమే. సబ్ మెర్సిబుల్ ముందు భాగాన ఒక కిటికి వంటి నిర్మాణం ఉంటుంది. దీనిద్వారా ప్రయాణికులు సముద్ర అంతర్భాగాన్ని చూడొచ్చు. వెలుతురు కోసం లోపల లైట్లను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో ఒక టాయ్‌లెట్ కూడా ఉంటుంది. దానికి తలుపు కాకుండా కేవలం కర్టెన్ మాత్రమే ఉంటుంది. సబ్ మెర్సిబుల్ బయట శక్తిమంతమైన లైట్లను ఏర్పాటు చేశారు. టైటానిక్ శిథిలాలు స్పష్టంగా కనిపించడం కోసం ఈ ఏర్పాటును చేశారు. లోపలి సిబ్బంది భారీ డిజిటల్ తెర మీద టైటానిక్ శిథిలాలను చూడొచ్చు. టైటాన్ తరహాలో చాలా లోతుల్లోకి వెళ్లే సబ్ మెర్సిబుల్స్‌లో జీపీఎస్ పనికి రాదు. జీపీఎస్‌కు బదులుగా ఒక ప్రత్యేకమైన టెక్స్ మెసేజింగ్ సిస్టమ్‌ను ఇందులో వాడారు. ఇది ఉపరితలం నుంచి సహాయక సిబ్బంది పంపే సూచనలు సబ్ మెర్సిబుల్‌లోని ప్రయాణీకులకు చేరేలా చేస్తుంది. సబ్‌మెర్సిబుల్‌లోని పైలట్ తనకు అందిన సూచనల ఆధారంగా ఒక వీడియో గేమ్ కంట్రోలర్‌తో వాహనాన్ని నడుపుతారు.

Tags

Read MoreRead Less
Next Story