Donald Trump: రష్యా ఆయిల్ కొనుగోలుకు భారత్‌కు 30 రోజుల గడువు

"భారత్ మాకు ముఖ్యమైన భాగస్వామి... అందుకే రష్యా ఆయిల్ కొనుగోలు విషయంలో 30 రోజుల పాటు వెసులుబాటు కల్పించాం" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. పశ్చిమ ఆసియా, గల్ఫ్ ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఆయిల్ మార్కెట్‌పై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.
అమెరికా ఆంక్షల కారణంగా సముద్రంలో నిలిచిపోయిన రష్యన్ క్రూడ్ ఆయిల్ షిప్‌మెంట్‌లను భారతీయ రిఫైనరీలు కొనుగోలు చేసేందుకు ఈ 30 రోజుల గడువు ఉపయోగపడుతుందని ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి సమీపంలో భద్రతా కారణాల రీత్యా ఆయిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉండటంతో, అంతర్జాతీయ మార్కెట్లో కొరత రాకుండా ఉండేందుకు ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే, ఈ కొనుగోలు ద్వారా రష్యాకు కొత్తగా ఎలాంటి ఆర్థిక ప్రయోజనం ఉండదని ట్రంప్ తేల్చిచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా, అమెరికాలోనూ ఆయిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, పరిస్థితి త్వరలోనే సర్దుబాటు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ మాట్లాడుతూ.. ఇది కేవలం స్వల్పకాలిక చర్య మాత్రమేనని, ప్రపంచ చమురు ధరలను స్థిరంగా ఉంచడమే దీని ఉద్దేశమని పేర్కొన్నారు. రష్యాపై ఉన్న తమ ఆంక్షల విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
