Pakistan Floods: పాకిస్తాన్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. 72 మంది మృతి

పాకిస్థాన్‌లో రుతుపవన వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానలతో దేశంలోని పలు ప్రావిన్సులు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఈ ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటివరకు 72 మంది ప్రాణాలు కోల్పోగా, 130 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 28 మంది చిన్నారులు ఉండటం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.
జూన్ 26 నుంచి జులై 6 మధ్య కురిసిన భారీ వర్షాలకు పంజాబ్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, సింధ్ ప్రావిన్సులు అతలాకుతలమయ్యాయి. ఈ విపత్తు వల్ల వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయని, ముఖ్యంగా బలూచిస్థాన్ ప్రాంతంలోనే సుమారు 15,000 గృహాలు దెబ్బతిన్నాయని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ) అధికారులు తెలిపారు. వరదల వల్ల వ్యవసాయ భూములు నీట మునిగి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్లు, వంతెనలు, పాఠశాలలు కొట్టుకుపోయి జనజీవనం స్తంభించింది.
మరోవైపు, పంజాబ్ ప్రావిన్స్‌లో సట్లెజ్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు గ్రామాల నుంచి దాదాపు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com