Luna-25 Crash: వైఫల్యం తట్టుకోలేక ఆసుపత్రి పాలైన శాస్త్రవేత్త

అంతరిక్ష రంగంలో మరో ముందడుగు కోసం రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్ అనూహ్యంగా విఫలమైంది. కక్ష్య మార్పు సమయంలో అదుపుకోల్పోయిన ల్యాండర్ చంద్రుడిపై కూలిపోయింది. దీంతో ఆ ప్రాజెక్ట్ పై ప్రేమను పెంచుకున్న వారి ఆశలు అడియాసలు అయ్యాయి. ముఖ్యంగా ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన 90 ఏళ్ళ రష్యా శాస్త్రవేత్త మిఖేయిల్ మారోవ్ తీవ్ర అవస్వస్థతకు లోనయ్యారు. లూనా-25 కూలిపోయిన విషయం తెలియగానే ఆయన కూడా అక్కడికక్కడే కూలబడిపోయారు. వెంటనే ఆయనను అక్కడున్న వారు ఆసుపత్రికి తరలించారు.
మామూలుగా మనం ఒక పని చేస్తేనే దానిమీద ప్రాణాలు పెడతాం.. శ్రద్ధగా చేస్తాం అది కాదు అనుకున్నప్పుడు, విఫల ప్రయత్నం అని తెలిసినప్పుడు మనసు బాధ పడిపోతుంది.. అలాగే బాధపడి ఉంటారు. లూనా-25 ప్రయోగంలో మిఖెయిల్ కీలక పాత్ర పోషించారు ఓ రష్యా వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మిఖెయిల్ మాట్లాడుతూ లూనా-25 వైఫల్యం పెద్ద ఎదురుదెబ్బ అని అభివర్ణించారు. ఈ వైఫల్యం తన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించిందన్నారు. ఇలాంటిది జరిగినప్పుడు ఆందోళన చెందకుండా ఉండటం సాధ్యం కాదని, ఇది తన జీవితానికి సంబంధించిన అంశం, ఎంతో క్లిష్టమైన సమయంగా పేర్కొన్నారు. రష్యా రాజధానిలోని ఓ ఆసుపత్రిలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిఖెయిల్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రష్యాకు చెందిన అనేక అంతరిక్ష ప్రయోగాల్లో మిఖెయిల్ పాల్గొన్నారు. ఆయన జీవితకాల కృషికి రూపమే లూనా-25 మిషన్.
ల్యాండర్‌ను జాబిల్లిపై దించలేకపోవడం తనకు ఎంతో విచారం కలిగించిందన్న ఆయనరష్యా లూనార్ ప్రోగ్రామ్ పునరుద్ధరణపై తమ చివరి ఆశలు ఆవిరైపోయాయి అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ వైఫల్యానికి గల కారణాలను నిశితంగా పరిశీలించి, విశ్లేషించాలని అభిప్రాయపడ్డారు. నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించడంలో విఫలమైన లూనా-25 ఆ తరువాత జాబిల్లి ఉపరితలంపై కూలిపోయిందని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్‌కాస్మోస్ పేర్కొంది. అయితే ఈ ఘటనకు కారణాలను మాత్రం వెల్లడించలేదు.
భారత్, రష్యాలు రెండూ ప్రస్తుతం చంద్రుడి మీదకు ల్యాండర్లు పంపించాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మిషన్ అయిన చంద్రయాన్-3 ఈ నెల 23న చంద్రుడి మీద ల్యాండ్ కావాల్సి ఉంది. చంద్రయాన్-3 కంటే ఆలస్యంగా ప్రయోగించిన లూనా-25, దానికన్నా ముందుగానే, అంటే సోమవారం నాటికే చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అవుతుందని అంచనా వేశారు. అయితే శనివారం మధ్యాహ్నం 2:57 గంటల తర్వాత లూనా-25తో సంబంధాలు తెగిపోయాయని రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్ రాస్‌కాస్మోస్ ఆదివారం ఉదయం తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com