USA Tornados: టోర్నడోలతో అమెరికాలో అల్లకల్లోలం
అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలో గత వారం రోజులుగా శక్తిమంతమైన సుడిగాలులు వీచి అనేక ఇళ్లను ధ్వంసం చేశాయి. వరుస సుడిగాలులతో ఆదివారం అమెరికాలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. శుక్రవారం 78 టోర్నడోల బీభత్సం తరువాత మరో 35 టోర్నడోలు నిన్న విరుచుకుపడ్డాయి. ఓక్లహోమా రాష్ట్రంలోని హోల్డన్‌విల్ అనే టౌన్‌లో రెండు టోర్నడోలు గంటల వ్యవధిలో విలయం సృష్టించాయి. ఈ క్రమంలో నాలుగు నెలల చిన్నారి సహా ఇద్దరు మృత్యువాత పడ్డారు. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఓక్లహోమాతో పాటు టెక్సాస్, నెబ్రాస్కా, కాన్సాస్, మిస్సోరీ రాష్ట్రాల్లోనూ సుడిగాలుల ప్రభావం కనిపించింది.
ఓక్లహోమా రాష్ట్రంలో టోర్నడోల కారణంగా కొన్ని ప్రాంతాల్లో గంటల వ్యవధిలోనే 18 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఆకస్మిక వరదలు, హిమపాతానికి కూడా అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఓక్లహోమాలోని సల్ఫర్ అనే టౌన్‌లో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. వాహనాలు తిరగబడ్డాయి. అనేక చెట్లు నేలకొరిగాయి. అత్యవసర సిబ్బంది మినహా సామాన్య పౌరులెవ్వరూ తమ టౌన్‌కు రావద్దని ముర్రే కౌంటీ షరిఫ్ (పోలీసు అధికారి) సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు. టోర్నడోల బీభత్సం దృష్ట్యా ఓక్లహోమాలో రాష్ట్ర గవర్నర్ 30 రోజుల పాటు ఎమర్జెన్సీ ప్రకటించారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, టెక్సాస్‌లో టోర్నడోల కారణంగా 50 వేల ఇళ్లు, ఓక్లమోమాలోని 30 వేల ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. అమెరికాలో మిడ్ వెస్ట్‌గా పిలిచే పలు రాష్ట్రాల్లో టోర్నడోలు ఎక్కువగా వస్తుంటాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతుంటారు. అయితే, రోజుల వ్యవధిలో రెండుసార్లు సుడిగాలులు ఇలా బీభత్సం సృష్టించడం చాలా అరుదైన విషయమని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com