Lock Down In Pakistan : పాకిస్తాన్‌లోని రెండు నగరాలలో పూర్తి లాక్‌డౌన్‌...

Lock Down In Pakistan : పాకిస్తాన్‌లోని రెండు నగరాలలో పూర్తి లాక్‌డౌన్‌...
X
తీవ్ర గాలి కాలుష్యం కారణంగా దారుణమైన పరిస్థితులు

వాయు కాలుష్యం మన ఢిల్లీ నగరంలోనే కాదు, పొరుగునే ఉన్న పాకిస్తాన్‌లోని నగరాలను కూడా వణికిస్తోంది. వాయు కాలుష్యం కారణంగా జనం అనేక అవస్థలు పడుతున్నారు. దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పంజాబ్ ప్రావిన్స్‌లోని రెండు నగరాలు లాహోర్, ముల్తాన్‌లలో పూర్తి లాక్‌డౌన్ విధించారు. తీవ్ర గాలి కాలుష్యం కారణంగా దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముల్తాన్ నగరంలో AQI 2000 దాటింది. లాహోర్‌లో AQI 1100 కంటే ఎక్కువగానే కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పంజాబ్ ప్రభుత్వం లాహోర్, ముల్తాన్‌లలో పూర్తి లాక్‌డౌన్ విధించిందని పాక్ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ARY న్యూస్ రిపోర్టు ప్రకారం.. లాహోర్ ప్రపంచంలోని రెండవ అత్యంత కాలుష్య నగరంగా ప్రకటించారు.

పంజాబ్ సీనియర్ ప్రావిన్షియల్ మంత్రి మరియం ఔరంగజేబ్ మాట్లాడుతూ.. పొగమంచు, కాలుష్యం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాల గురించి వివరించారు. దీనివల్ల ప్రజారోగ్య సంక్షోభం ఏర్పడిందని.. ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని అన్నారు. ఇప్పటి పరిస్థితులను కోవిడ్ సమయంలో అనుభవించిన ప్రమాదాలతో పోల్చాడు. మరోవైపు.. పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా.. పంజాబ్ ప్రభుత్వం నవంబర్ 24 వరకు హయ్యర్ సెకండరీ స్థాయి వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇదిలా ఉంటే.. పంజాబ్ ప్రావిన్స్‌లో కేవలం ఒక వారంలోనే 600,000 మందికి పైగా ప్రజలు కాలుష్య సంబంధిత వ్యాధుల బారిన పడ్డారు. గత వారంలో 65,000 మందికి పైగా ప్రజలు ఆసుపత్రి పాలయ్యారు. ఈ దృష్ట్యా, ప్రాంతీయ ప్రభుత్వం పారామెడికల్ సిబ్బంది సెలవులను రద్దు చేసింది. OPD సమయాన్ని రాత్రి 8 గంటల వరకు పొడిగించింది.

Tags

Next Story