Train attack : బంగ్లాదేశ్‌లో రైలుకు నిప్పు, నలుగురు సజీవదహనం

బంగ్లాదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కొందరు ఆందోళనకారులు ఉన్మాదుల్లా వ్యవహరించారు. విమానాశ్రయం నుంచి ఢాకా నగరంలోకి వెళ్తున్న రైలుకు నిప్పుపెట్టారు. దాంతో రైలు మూడు బోగీలకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఒక మహిళ, మైనర్ అయిన కుమారుడితోపాటు మొత్తం నలుగురు సజీవదహనం అయ్యారు. బంగ్లాదేశ్‌లో జనవరి 7న పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పోలింగ్‌లో అవకతవకలు జరగకుండా ఏ పార్టీకీ సంబంధం లేని ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాన ప్రతిపక్షమైన ‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)’ పార్టీ డిమాండ్ చేసింది. బీఎన్‌పీ డిమాండును పాలక అవామీ లీగ్ తిరస్కరించింది. దాంతో ఆగ్రహించిన బీఎన్‌పీ ఈ ఎన్నికల బహిష్కరణ కోసం ఉద్యమిస్తోంది. బీఎన్‌పీకి చెందిన ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టు నుంచి ఢాకా సిటీలోకి వెళ్తున్న రైలుకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com