Baby Bonus: కంటే 5 వేల డాలర్లు!

దేశంలో ఏటికేడు పడిపోతున్న సంతానోత్పత్తి రేటుపై అమెరికా సర్కారు దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. జనాభా పెరిగేలా పలు ప్రోత్సాహకాలు ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. పిల్లల్ని కనే తల్లులకు 5 వేల డాలర్ల (సుమారు రూ.4.25 లక్షలు) బేబీ బోనస్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. దాంతో పాటు చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ (పన్ను మినహాయింపులు) పెంపు, ఫెడరల్ ప్రభుత్వం సాయంతో ఇచ్చే ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం లాంటి వాటిలో పెండ్లి అయిన దంపతులు, పిల్లలున్న వారికి 30 శాతం రిజర్వేషన్ తదితర ప్రతిపాదనలు ఉన్నట్టు సమాచారం. అంతేకాదు, సంతానం సంబంధిత విషయాలపై అమెరికన్ మహిళలకు అవగాహన కల్పించడం లాంటి ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ ప్రతిపాదనలకు వైట్‌హౌజ్ అధికారికంగా ఆమోదం తెలపనప్పటికీ, సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తున్నది.
జేడీ వాన్స్, మస్క్ మద్దతు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఎలాన్ మస్క్ సహా ట్రంప్ ప్రభుత్వంలోని కీలక హోదాలో ఉన్నవారు జనాభా వృద్ధిపై మొదటి నుంచీ సానుకూలంగా ఉన్నారు. అమెరికాలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటును నాగరికత సంక్షోభంగా వాన్స్ గతంలో అభివర్ణించారు. ముగ్గురు పిల్లల తండ్రి అయిన వాన్స్.. ప్రభుత్వ కార్యక్రమాల్లో పిల్లలతో కలిసి పాల్గొంటుంటారు. ఇక, జనాభా పెరుగుదలకు 14 మంది పిల్లలకు తండ్రి అయిన మస్క్ బహిరంగంగానే మద్దతు తెలుపుతుంటారు.
ప్రోత్సాహకాలతో జనాభా పెరిగేనా?
1990ల నుంచి అమెరికాలో సంతానోత్పత్తి రేటు క్రమంగా పడిపోతున్నది. అమెరికా దేశ సంతానోత్పత్తి రేటు ఒక మహిళకు 1.62 మాత్రమే. జీవన వ్యయాలు భారీగా పెరగడం, శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం ఎక్కువ కావడం లాంటి కారణాల వల్ల సంతానోత్పత్తి రేటు తగ్గిపోయినట్టు దేశంలోని నిపుణులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com