US Visa: 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాల పరిశీలన

US Visa: 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాల పరిశీలన
X
నిరంతర పరిశీలన ప్రక్రియను ప్రారంభించిన అమెరికా విదేశాంగ శాఖ

అమెరికా ప్రభుత్వం వలస విధానాలపై మరో కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చెల్లుబాటులో ఉన్న 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాలను సమీక్షిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ గురువారం సంచలన ప్రకటన చేసింది. ఈ సమీక్షలో ఎవరైనా వీసా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే, తక్షణమే వారి వీసాను రద్దు చేయడమే కాకుండా, వారు అమెరికాలో ఉంటే దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.

నిరంతర పరిశీలన పేరుతో చేపట్టిన ఈ భారీ ప్రక్రియలో భాగంగా, వీసాదారులందరి రికార్డులను నిశితంగా తనిఖీ చేయనున్నారు. వీసా జారీ చేసిన తర్వాత వారి ప్రవర్తనలో ఏవైనా అనూహ్య మార్పులు వచ్చాయా? వారు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారా? అనే అంశాలను అధికారులు పరిశీలిస్తారు. ముఖ్యంగా వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోవడం, నేర కార్యకలాపాలకు పాల్పడటం, ప్రజా భద్రతకు ముప్పు కలిగించడం, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

ఈ పరిశీలన కోసం వీసాదారుల సోషల్ మీడియా ఖాతాలు, వారి స్వదేశంలోని చట్ట సంస్థల వద్ద ఉన్న రికార్డులు, అమెరికాలో వారి ప్రవర్తనకు సంబంధించిన అన్ని వివరాలను పరిగణనలోకి తీసుకుంటామని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇది కేవలం కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే కాకుండా, ఇప్పటికే వీసా కలిగి ఉన్న వారందరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ట్రంప్ పరిపాలన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా జాతీయ భద్రత, ప్రజా భద్రత పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని విదేశాంగ శాఖ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే రెండు రెట్ల కంటే ఎక్కువ వీసాలను, ముఖ్యంగా విద్యార్థి వీసాలను దాదాపు నాలుగు రెట్లు అధికంగా రద్దు చేశామని పేర్కొంది. ట్రంప్ తిరిగి అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 6,000కి పైగా విద్యార్థి వీసాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో చాలామంది మద్యం సేవించి వాహనాలు నడపడం, దాడులకు పాల్పడటం, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం వంటి కారణాలతో వీసాలు కోల్పోయారని తెలిపారు. ఈ 6,000 కేసుల్లో దాదాపు 200 నుంచి 300 వరకు ఉగ్రవాద సంబంధిత కారణాలతో రద్దు చేసినట్లు వివరించారు. ఈ విస్తృతస్థాయి సమీక్ష అమెరికా వలస విధానాల్లో మరో కీలక మార్పుగా నిపుణులు భావిస్తున్నారు.

Tags

Next Story