Trump: నోబెల్ ఫ్రైజ్ ఇవ్వాల్సిందే.. భారత్-పాక్ సహా 7 యుద్ధాలను ఆపానంటున్న ట్రంప్ .

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మరోసారి అవే మాటలు వచ్చాయి. తానే ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ మరో సారి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే 40 కన్నా ఎక్కువ సార్లు పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 7 యుద్ధాలను ఆపినందుకు తనకు ‘‘నోబెల్ శాంతి బహుమతి’’ ఇవ్వాలని అన్నారు.
శనివారం జరిగిన అమెరికన్ కార్నర్‌స్టోన్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుల విందులో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘భారత్, పాకిస్తాన్ గురించి ఆలోచించండి. నేను వాణిజ్యంతో యుద్ధాన్ని ఆపాను. వారు వ్యాపారం చేయానుకుంటున్నారు. నాకు ఇద్దరు నాయకుల పట్ల గౌరవం ఉంది’’ అని అన్నారు. భారత్-పాకిస్తాన్ సంఘర్షణను ముగించడానికి ‘‘వాణిజ్యం’’ కీలక పాత్ర పోషించిందని మరోసారి ట్రంప్ చెప్పారు. ‘‘భారతదేశం- పాకిస్తాన్, థాయిలాండ్- కంబోడియా, అర్మేనియా- అజర్‌బైజాన్, కొసావో -సెర్బియా, ఇజ్రాయెల్- ఇరాన్, ఈజిప్ట్ – ఇథియోపియా, రువాండా – కాంగో యుద్ధాలను ఆపాము. వీటిలో 60 శాతం వాణిజ్యం కారణంగా నిలిపివేయబడ్డాయి.” అని ట్రంప్ అన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’తో దాడులు చేసింది. మే 10 తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్ పాకిస్తాన్‌లోని టెర్రర్ స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు పాక్ వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. అయితే, ఈ సంఘర్షణ సుదీర్ఘ రాత్రి చర్చల ద్వారా పరిష్కరించబడిందని, కాల్పుల విరమణ జరిగిందని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. మీరు యుద్ధం ఆపకుంటే, మీతో వ్యాపారం చేయమని రెండు దేశాలను హెచ్చరించానని, దీంతో వారు యుద్ధం ఆపేశారని ట్రంప్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే, ఈ వాదనల్ని భారత్ ఖండిస్తూ వస్తోంది. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణ జరిగిందని భారత్ చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com