Iran-US: ఇరాన్-అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు

అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,ఇరాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ తన అణు కార్యక్రమంపై వాషింగ్టన్‌తో ఒక ఒప్పందానికి రాకుంటే బాంబు దాడులు తప్పవని హెచ్చరించారు. అధ్యక్షుడి హెచ్చరికలతో అప్రమత్తమైన టెహ్రాన్.. క్షిపణులతో సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియా టెహ్రాన్ టైమ్స్ నివేదించింది.
ఆదివారం ఎన్‌బీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఒకవేళ అణుఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ నిరాకరిస్తే.. బాంబు దాడులు తప్పవు. ఆ దేశం మునుపెన్నడూ చూడని రీతిలో దాడులు ఉంటాయి. టెహ్రాన్‌పై మరోసారి సుంకాలు విధిస్తాను’ అని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికలతో అప్రమత్తమైన ఇరాన్.. దేశవ్యాప్తంగా ఉన్న భూగర్భ ప్రయోగ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో క్షిపణులను లాంచ్‌ప్యాడ్‌లపై సిద్ధంగా ఉంచినట్లు టెమ్రాన్ టైమ్స్ వెల్లడించింది. వైమానిక దాడుల కోసం వీటిని ప్రయోగించే అవకాశాలున్నట్లు తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో అమెరికా సంబంధిత ప్రాంతాలపై దాడులు చేసేందుకు ఈ క్షిపణులను ఉపయోగించే ప్రణాళిక ఉందని సదరు కథనం పేర్కొంది.
2018లో ఇరాన్ తో ఒప్పందం రద్దు
ట్రంప్ తన మొదటి 2017-21 పదవీకాలంలో ఇరాన్‌తో సంబంధాలు అంతంతమాత్రంగానే సాగించారు. ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని కాస్తా 2018లో రద్దు చేశారు. అప్పటి నుంచి ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతన్నాయి. ఆ తర్వాత ఇరాన్‌పై ఆంక్షలు విధించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఆ తర్వాత అనేక సంవత్సరాలుగా పరోక్ష చర్చలు ఫలించకపోవడంతో.. ఇటీవల ట్రంప్ మళ్లీ అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. కానీ, ఈ విషయంలో ఇరాన్ వైఖరి యథాతథంగా కొనసాగుతుండటం ఉద్రిక్తతలకు తెరపడటం లేదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇలాంటి వార్నింగ్ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com