USA: అమెరికా అటార్నీ జనరల్‌గా పామ్ బోండి

మాట్ గేట్జ్ స్థానంలో అమెరికా అటార్నీ జనరల్‌గా పమేలా జో బోండీని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. ఆ పదవికి ఇటీవలే నామినేట్ చేసిన మాట్ గేట్జ్ తప్పుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గేట్స్‌పై లైంగిక వైధింపులు, 17 ఏళ్ల మైనర్ బాలికతో శృంగారం, మాదకద్రవ్యాల వాడడం తదితర ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో ఆయన నియామకంపై ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్ల నుంచే వ్యతిరేకత ఎదురైంది.
తనపై ఆరోపణలను గేట్జ్ ఖండించినా ఈ వివాదం ట్రంప్‌కు ఇబ్బందికరంగా మారిందని వ్యాఖ్యానించారు. అందుకే ఏజీగా బాధ్యతలు చేపట్టబోనని ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది గంటలకే ఏజీగా బోండీని ఎంపిక చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఫ్లోరిడాకు తొలి మహిళా అటార్నీ జనరల్‌గా నేరాలపై కఠినంగా ఆమె వ్యవహరించారని ట్రంప్ ప్రశంసించారు.
ట్రంప్ తొలి హయాంలో ఓపియాయిడ్ అండ్ మాదకద్రవ్యాల దుర్వినియోగ కమిషన్‌లో బోండీ పని చేశారు. ట్రంప్‌తో బోండీకి చాలా ఏళ్లుగా స్నేహముంది. 2020లో సెనేట్ అభిశంసన విచారణలో ట్రంప్ తరఫున డిఫెన్స్ లాయర్‌గా ఆమె వ్యవహరించారు. మనీ లాండరింగ్ విచారణ సందర్భంగా ట్రంప్‌కు బహిరంగంగానే మద్దతిచ్చారు. 2018లో కూడా జెఫ్ సెషన్స్ స్థానంలో బోండీని ఏజీగా ట్రంప్ నియమిస్తారని వార్తలొచ్చాయి.
నాలుగో మహిళ
అమెరికా అటార్నీ జనరల్ పదవి చేపట్టబోతున్న నాలుగో మహిళ బోండీ. దేశ తొలి మహిళా ఏజీగా జానెట్ రెనో నిలిచారు. 1993–2001 మధ్య కాలంలో క్లింటన్ హయాంలో ఆ పదవి చేపట్టారు. తర్వాత 2015–2017 మధ్య ఒబామా హయాంలో లోరెట్టా లించ్ ఆ పదవిని చేపట్టిన రెండో మహిళ. ఆమె రాజీనామా అనంతరం సాలీ యేట్స్ 10 రోజుల పాటు తాత్కాలిక ఏజీగా వ్యవహరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com