Trump: మా బెదిరింపులతో ఇరాన్‌లో హత్యలు ఆగాయి.. ట్రంప్

Trump: మా బెదిరింపులతో ఇరాన్‌లో హత్యలు ఆగాయి.. ట్రంప్
X
ట్రంప్‌, నెతన్యాహునే నరహంతకులన్న ఇరాన్

గత కొద్దిరోజులుగా ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటి వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే నిరసన కారులపై కాల్పులు ఆపకపోతే అమెరికాలోకి రంగంలోకి దిగుతుందని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు ఇరాన్‌పై దాడులు చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

తాజాగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. తన హెచ్చరికలతో ఇరాన్‌లో హత్యలు, ఉరిశిక్షలు ఆగిపోయాయని తెలిపారు. రోజుల తరబడి హెచ్చరికలు, బెదిరింపులతో ఇరాన్‌ వెనక్కి తగ్గిందని.. ఇందుకు సంబంధించిన సమాచారం తన దగ్గర ఉందని చెప్పారు. తదుపరి చర్యల గురించి జాతీయ భద్రతా బృందంతో చర్చిస్తున్నట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే డిసెంబర్ 28 నుంచి జరుగుతున్న నిరసనల్లో దాదాపు 3 వేల మంది వరకు చనిపోయినట్లుగా అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. కానీ ఆ సంఖ్య 12 వేల వరకు ఉండొచ్చని సమాచారం. ఇదిలా ఉంటే ఇరాన్‌పై చర్యలు తీసుకునేందుకు పెద్ద ఎత్తున అమెరికా సైనిక విమానాలు ఖతార్‌లో మోహరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు ఇరాన్ గగనతలాన్ని ప్రభుత్వం మూసేసింది. అమెరికా దాడులు చేస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో మూసేసినట్లుగా సమాచారం.

ఇరాన్‌ సహా 75 దేశాలకు వీసాల నిలిపివేత

అగ్రరాజ్యం అమెరికా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌, రష్యా సహా 75 దేశాలకు చెందిన ఇమిగ్రెంట్‌ వీసా దరఖాస్తులపై నిషేధాన్ని విధించింది. ఇమిగ్రేషన్‌ తనిఖీలను కఠినతరం చేసే విస్తృత ప్రయత్నంలో భాగంగా 75 దేశాల దరఖాస్తుదారులకు వలస వీసా ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది.

దేశంలోకి ప్రవేశించిన తర్వాత ప్రభుత్వ సహాయంపై ఆధారపడే అవకాశం ఉన్న వ్యక్తులకు వీసాలు మంజూరు చేయకుండా నిరోధించడమే ఈ చర్యల లక్ష్యం. ఈ నిషేధం ఈ నెల 21 నుంచి అమల్లోకి వస్తుంది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇలా నిషేధం విధించిన దేశాల్లో ఇరాన్‌, రష్యా, సోమాలియా, అఫ్ఘానిస్థాన్‌, బ్రెజిల్‌, ఈజిప్ట్‌, నైజీరియా, థాయ్‌లాండ్‌, యెమెన్‌ తదితర దేశాలున్నట్టు వైట్‌ హౌస్‌ ప్రెస్‌ కార్యదర్శి కరోలిన్‌ లెవిట్‌ వెల్లడించారు.

Tags

Next Story