Donald Trump: కమల కంటే నేనే అందంగా కనిపిస్తా..

Donald Trump: కమల కంటే నేనే అందంగా కనిపిస్తా..
నోరుపారేసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, భారత సంతతి మహిళ అయిన కమలా హారిస్‌ ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు.

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కంటే తానే బాగుంటానని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ విధంగా నోరుపారేసుకున్నారు. ఇటీవల టైమ్‌ మ్యాగజైన్ కవర్ పేజీపై కమల ఫొటోను ప్రస్తావిస్తూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు పలికారు.

‘కమలా హారిస్‌ కంటే నేనే బాగుంటా. ఆమె ఫొటోలు సరిగా లేకపోవడంతో టైమ్‌ మ్యాగజైన్ వాళ్లు స్కెచ్ ఆర్టిస్ట్ను హైర్ చేసుకున్నారు’ అని అహంకారపూరితంగా హేళన చేశారు. అంతేగాక కమలా హారిస్‌ ర్యాడికల్ లిబరల్ అని కూడా వ్యాఖ్యానించారు. కాగా, అనారోగ్య కారణాలతో డెమోక్రాట్స్‌ అభ్యర్థి బైడెన్‌ పోటీ నుంచి తప్పుకోవడంతో కమలా హారిస్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు.

‘‘ది వాల్ స్ట్రీట్ జర్నల్‌’’లో కమల అందాన్ని వర్ణిస్తూ కాలమిస్ట్ పెగ్గీ నూనన్‌ ఓ వ్యాసాన్ని రాశారు. అయితే వ్యాసాన్ని ఉద్దేశించి ట్రంప్‌.. ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే.. రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి డేవిడ్ మెక్‌కార్మిక్‌ను ఉద్దేశించి.. ‘‘డేవిడ్.. దయచేసి స్త్రీని అందంగా ఉ‍న్నారని ఎప్పుడూ పొగడకండి. ఎందుకంటే అది మీ రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతుంది’’ అని అన్నారు. టైమ్ మ్యాగజైన్ కవర్‌పై కమలా ఫొటోను ప్రస్తావిస్తూ.. అందులో ఉన్నది హీరోయిన్లు సోఫియా లోరెన్ లేదా ఎలిజబెత్ టేలర్ అనుకున్నానని సెటైర్లు వేశారు.

శుక్రవారం కమల ప్రకటించిన ఆర్థిక ప్రణాళికను.. యుఎస్‌లో కమ్యూనిజానికి దారితీసే ప్రణాళిక అని ట్రంప్‌ ఆరోపణలు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో గత మూడు వారాలుగా కమలపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలకు సైతం ట్రంప్‌ వెనుకాడడం లేదు. కమలకు ‘పిచ్చి’ ఉందని కూడా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

Tags

Next Story