US Bans Sports Visas: ట్రంప్ పాలనలో నయా పాలసీ..

US Bans Sports Visas: ట్రంప్ పాలనలో నయా పాలసీ..
X
వారికి స్పోర్ట్స్ వీసాలపై నిషేధం!

వివాదాస్పద నిర్ణయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ . అమెరికా ఫస్ట్‌ అంటూ విదేశీ విద్యార్థులపై ఆంక్షలు, అక్రమ వలసదారులకు బేడీలు వేసి బలవంతంగా వారి స్వదేశాలకు పంపించడం, ప్రపంచ దేశాలపై ఎడాపెడా ప్రతీకార సుంకాలు, గ్రీన్‌ కార్డులు, వీసాలపై కోతలు విధిస్తూ తనదైన శైలిలో పాలనను కొనసాగిస్తున్నారు. తాజాగా ట్రాన్స్‌ జెండర్‌ మహిళలకు స్పోర్ట్స్‌ వీసాలపై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహిళల క్రీడల్లో పోటీ పడాలనుకునే లింగమార్పిడి మహిళలకు మీసా అర్హతను పరిమితం చేస్తున్నట్లు ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు అమెరికన్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పాలసీని సవరించింది. దీని ప్రకారం పురుషుడిగా జన్మించి లింగమార్పిడి చేసుకుని మహిళల క్రీడల్లో పోటీ పడే క్రీడాకారుల దరఖాస్తులను ప్రతికూలంగా పరిగణించనుంది.

అదేవిధంగా ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారికి ఇచ్చే ఓ-1ఏ (O-1A) వీసాలు, అత్యుత్తమ ప్రతిభ కలిగిన వలసదారులకు ఇచ్చే ఈబీ-1, ఈబీ-2 గ్రీన్ కార్డులు, అలాగే నేషనల్ ఇంటరెస్ట్ వేవర్స్ వంటివి ఇకపై ట్రాన్స్‌జెండర్ మహిళలకు సులభంగా మంజూరు కాబోవని యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించింది. బయాలజికల్ గుణల వల్ల పురుషులు మహిళల క్రీడలలో గెలిచే అవకాశాన్ని ట్రాన్స్‌జెండర్ ముసుగులో వాడుకుంటున్నారని చాలా కేసుల్లో స్పష్టమైందని ఆ సంస్థ అధికార ప్రతినిధి మాథ్యూ ట్రాగెసర్ వెల్లడించారు. మహిళా క్రీడాకారుల భద్రత, సమానత్వం, గౌరవం, నిజం అనే ప్రమాణాలను రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనడాన్ని నిషేధించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ట్రంప్ సంతకం చేశారు. మహిళల క్రీడలపై జరుగుతున్న యుద్ధం ఈ ఆదేశాలతో ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. మహిళా అథ్లెట్ల సంప్రదాయాన్ని మేం రక్షిస్తాం. వారి క్రీడల్లోకి పురుషులు ప్రవేశించి, వారిని కొట్టడాన్ని అడ్డుకుంటాం. ఇక నుంచి స్త్రీల క్రీడలు స్త్రీలకు మాత్రమే అని స్పష్టం చేశారు. అయితే ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయానికి సెనెట్‌లో చెక్కెదురైంది. మార్చి 5న సెనెట్‌లో జరిగిన ఓటింగ్‌లో వ్యతిరేకంగా 45 ఓట్లు రావాల్సి ఉంది. బిల్లుకు మద్దతుగా 60 ఓట్లు రావాల్సి ఉండగా 51 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ నేపథ్యంలో యూఎస్‌సీఐఎస్‌లో ట్రంప్‌ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది.

Tags

Next Story