Donald Trump: సునీతా విలియమ్స్‌ను వైట్‌హౌస్‌కు పిలవకపోవటానికి కారణాలివే

భూమికి సురక్షితంగా తిరిగివచ్చిన సునీతా విలియమ్స్, ఇతర వ్యోమగాములు ఇక్కడి వాతావరణానికి తిరిగి అలవాటు పడటం అంత సులువుకాదని, అందుకే వారిని శ్వేతసౌధానికి ఇప్పుడే ఆహ్వానించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ‘‘వారు ఇన్నాళ్లూ అంతరిక్షంలో ఉన్నారు. ఇక్కడి వాతావరణానికి అలవాటుపడటానికి చాలా సమయం పడుతుంది. వాళ్ల పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఓవల్ ఆఫీసుకు తప్పకుండా పిలుస్తా’’ అని ఆయన వెల్లడించారు. శ్వేతసౌధం మీడియా ప్రతినిధి సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ- ‘‘ట్రంప్ హామీ ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు. తొమ్మిది నెలలపాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చారు. ఇందుకు సహకరించిన ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్, నాసాకు కృతజ్ఞతలు’’ అని రాసుకొచ్చారు.
తొమ్మిది నెలలు రోదసిలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరకోవడంపై స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వ్యోమగాములను తీసుకొచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని, ట్రంప్ మాత్రం స్పేస్‌ఎక్స్‌ని సంప్రదించారని చెప్పారు. స్పేస్‌ఎక్స్, నాసా బృందాలకు అభినందనలు తెలిపారు.
త్వరలోనే భారత్‌కు సునీత!
గాంధీనగర్: అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమిమీదకి తిరిగి వచ్చిన వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భారత్‌కు రానున్నారని ఆమె బంధువొకరు మీడియాకు తెలిపారు. ‘సునీత కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాం. ఆమె భూమిపై దిగిన క్షణాలు అపురూపం. అంతా సాఫీగా సాగినందుకు ఆనందంగా ఉంది. ఎలాంటి సవాళ్లనైనా ఆమె ఎదుర్కోగలదు. మా అందరికీ ఆమె ఆదర్శం. సునీత అంతరిక్షంలో ఉన్నప్పుడు కూడా మేం ఆమెతో మాట్లాడుతున్నాం. ఇటీవల నేను మహా కుంభమేళాకు వెళ్లగా అక్కడి విశేషాలను అంతరిక్షం నుంచే అడిగి తెలుసుకున్నారు’ అని ఆమె బంధువు ఫాల్గుణి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com