Donald Trump: హార్ముజ్‌ను మూసేస్తాం, చర్చల విఫలం తర్వాత ట్రంప్ సంచలన హెచ్చరిక..

పాకిస్తాన్ వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి లేదా దాని నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న నౌకల్ని తాము అడ్డుకుంటామని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ట్రంప్ నిర్ణయంతో ప్రపంచం షాక్ అయింది. ట్రంప్ చర్యలతో గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ ఏర్పడే అవకాశం ఉంది.
“తక్షణమే అమలులోకి వచ్చేలా, హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి లేదా దాని నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న అన్ని నౌకలను దిగ్బంధించే ప్రక్రియను యునైటెడ్ స్టేట్స్ నౌకాదళం ప్రారంభిస్తుంది,” అని ఆయన అన్నారు. హార్ముజ్ తెరిచి ఉంచుతామన్న హామీలను ఇరాన్ నెలబెట్టుకోలేదని, సముద్రంలో మైన్లు ఉన్నాయన్న భయంతో ఇప్పటికే నౌకల రాకపోకలు తగ్గిపోయాయని ఆయన పేర్కొన్నారు.
ఇస్లామాబాద్ చర్చల్లో ఇరాన్ అధికారులతో పలు అంశాలపై ఒప్పందం కుదరిందని, అయితే, అణుశక్తిపై ఒప్పందం కుదరలేదని ట్రంప్ చెప్పారు. ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుదాలు ఉండవని హెచ్చరించారు. హార్ముజ్ జలసంధిలోని మైన్‌లను తొలగిస్తామని, ఇరాన్ ‘‘చట్టవిరుద్ధమైన సుంకాలు’’ చెల్లిస్తున్న నౌకల్ని అడ్డుకుంటామని ఆయన తెలిపారు. చట్టవిరుద్ధమైన సుంకాలు చెల్లించే వారికి బహిరంగ సముద్రంలో సురక్షిత ప్రయాణం ఉండదని హెచ్చరించారు. ఇరాన్ సైనిక సామర్థ్యం ఇప్పటికే గణనీయంగా దెబ్బతిందని, వాయు రక్షణ వ్యవస్థ చాలా వరకు నిర్వీర్యమైందని ట్రంప్ అన్నారు. అమెరికా దళాలపైనా, వాణిజ్య నౌకలపైనా ఇరాన్ దాడులకు దిగితే తీవ్ర ప్రతిచర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తమపై కానీ, శాంతియుత నౌకలపై కానీ దాడులు చేసే ఇరానియన్లను పేల్చేస్తామని హెచ్చరించారు. ఇరాన్‌తో చర్చల్లో చాలా అంశాల్లో ఒప్పందం కుదిరిందని, అయితే కీలకమైన ఇరాన్ అణు కార్యక్రమంపైనే ఏకాభిప్రాయం కుదరలేదని ట్రంప్ చెప్పారు. అణు కార్యక్రమాన్ని విడిచిపెట్టేందుకు ఇరాన్ సిద్ధంగా లేదన్నారు. అయితే ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం సాధించలేదని పునరుద్ఘాటించారు. ప్రపంచంలో 20 శాతం చమురు సరఫరా హొర్ముజ్ జలసంధి గుండానే సాగుతుంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసినప్పటి నుంచి హొర్ముజ్‌ను ఇరాన్ మూసివేసింది. హొర్ముజ్‌ను దిగ్బంధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జీసీ) తీవ్రంగా స్పందించింది. జలసంధి తమ ఆధీనంలోనే ఉన్నదని పేర్కొన్నది. శత్రువులు ఎలాంటి దుస్సాహసానికి తెగబడినా జలసంధిలోని ప్రమాదకర సుడిగుండాల్లో చిక్కుకు పోవడం ఖాయమని హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
