డెమొక్రాట్ల చేతికి కీలక ఆధారం.. ట్రంప్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

డెమొక్రాట్ల చేతికి కీలక ఆధారం.. ట్రంప్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
క్యాపిటల్ హిల్ భవనంపై దాడికి సంబంధించిన ఒక వీడియో బయటపడడంతో డెమొక్రాట్ల చేతికి కీలక ఆధారం దొరికినట్లైంది.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనంపై జరిగిన దాడికి ట్రంప్ రెచ్చగొట్టారంటూ ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ట్రంప్‌ను అభిశంసించాలంటూ డెమొక్రాట్లు పట్టుబట్టారు. ఈ మేరకు సాగుతున్న ట్రయల్‌లో గట్టిగా వాదనలు వినిపిస్తున్నారు. ఇక ఈ దాడికి సంబంధించిన ఒక వీడియో బయటపడడంతో డెమొక్రాట్ల చేతికి కీలక ఆధారం దొరికినట్లైంది. ట్రంప్ కేసులో ఈ వీడియో బలమైన ఆధారంగా నిలిచే అవకాశం ఉంది.

ట్రంప్‌ను అభిశంసించడానికి ఉద్దేశించిన తీర్మానంపై బుధవారం సెనేట్‌లో విచారణ ప్రారంభమైంది. ట్రంప్‌కు వ్యతిరేకంగా జామీ రస్కిన్‌తోపాటు పలువురు డెమొక్రటిక్ నేతలు బలంగా వాదనలు వినిపించారు. ట్రంప్ అమాయక ప్రేక్షకుడు కాదని రస్కిన్ వాదించారు. కమాండర్-ఇన్-చీఫ్‌గా తాను నిర్వర్తించాల్సిన విధులను ట్రంప్ విస్మరించారని.. అధ్యక్షుడిగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారని రస్కిన్ ఆరోపించారు.

పెన్స్, ఆయన కుటుంబసభ్యులు ఉన్న చోటికి 100 అడుగుల చేరువలోకి ఆందోళనకారులు వెళ్లారని, కానీ అదృష్టావశాత్తు ప్రమాదం తప్పిందని మరో డెమొక్రటిక్ నేత ప్లాస్కెట్ అన్నారు. ఇక ఆ రోజు స్పీకర్ నాన్సీ పెలోసీ చిక్కివుంటే ఆమెను ఆందోళనకారులు చంపేసి ఉండేవారని ప్లాస్కెట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక డెమొక్రాట్ల వాదనలకు సెనేట్‌లో ఆరుగురు రిపబ్లికన్లు మద్దతిచ్చారు. కొంతమంది భారతీయ అమెరికన్ సభ్యులు కూడా అభిశంసన తీర్మానంపై విచారణ ప్రారంభానికి మద్దతుగా నిలిచారు.

డెమెక్రాట్ల చేతికి చిక్కిన వీడియోలో ఆందోళనకారులు ఆగ్రహంతో పెన్స్, నాన్సీ పెలోసీల కోసం వెదకడం కనిపించింది. దాడితో చట్టసభ్యులు టెన్షన్ పడడం, పెన్స్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులను సురక్షితంగా ఉంచడానికి అధికారులు అక్కడి నుంచి తరలించడం కూడా కనిపించింది. ఇక పోలీసులపై ఆందోళనకారులు దాడి చేయడం, పెన్స్‌ను ఉరితీయండి అంటూ నినాదాలు చేయడం వంటి దృశ్యాలన్నీ ఆ వీడియోలో ఉన్నాయి. ఇక మరో ఆడియో క్లిప్‌ కూడా డెమొక్రాట్ల చేతికి చిక్కింది. ఆందోళనకారులు మాపైకి ఇనుప కడ్డీలు విసురుతున్నారు.. అంటూ పోలీసులు చేసిన హాహాకారాలు అందులో రికార్డయ్యాయి.


Tags

Read MoreRead Less
Next Story