Trump: ట్రంప్ ను వదలను అంటున్న కేసులు

Trump: ట్రంప్ ను వదలను అంటున్న కేసులు
ఏడాదిలో మూడో క్రిమినల్​ కేసు

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి అమెరికా అధ్యక్ష పీఠాన్ని మళ్లీ అధిరోహించాలని కలలు కంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వరుస కేసులు వదలడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే రెండు కేసుల్లో ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదవ్వగా తాజాగా మరో కేసు నమోదైంది. 2020 నాటి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన కేసులో ఆయనపై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఇప్పటికే రహస్య పత్రాల తరలింపు కేసు, పోర్న్ స్టార్ స్టార్నీ డేనియల్స్ వ్యవహార కేసులోనూ ట్రంప్‌పై నేరాభియోగాలను నమోదు చేశారు.

2020 అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమిని తిప్పిగొట్టడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్‌పై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(FBI)] క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ట్రంప్‌ (Donald Trump)పై దర్యాప్తు చేపట్టాలని వాషింగ్టన్‌ స్పెషల్‌ కౌన్సిల్‌ జాక్‌ స్మిత్‌ ఆదేశించారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న అవాస్తవ ఆరోపణల ఆధారంగా ట్రంప్‌ తమపై ఒత్తిడి తీసుకొచ్చారని కొందరు అధికారులు న్యాయస్థానం ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.


బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించకుండా కాంగ్రెస్‌ను ఆపేందుకు 2021 జనవరిలో క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో మాజీ అధ్యక్షుడిపై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా ట్రంప్ గురువారం కోర్టులో హాజరుకాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే, తాజా నేరాభియోగాలను ట్రంప్‌ తోసిపుచ్చారు. ఉద్దేశపూర్వకంగానే డెమోక్రాట్లు తనను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపించారు.

2021 జనవరి 6న ట్రంప్‌ తన మద్దతుదారులను ఉద్దేశించిన ప్రసంగించిన కొద్ది గంటలకే అమెరికా క్యాపిటల్‌ భవనంపై భీకర దాడి జరిగింది. వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు భవనంలోకి దూసుకెళ్లారు.

అయితే తనపై నమోదు చేసిన అభియోగాలు రుజువై, శిక్షపడినా అధ్యక్ష బరి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని ట్రంప్‌ ఇప్పటికే స్పష్టంచేశారు. తాను ఎలాంటి తప్పుచేయలేదని పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పేలా ఉద్యోగులను బెదిరిస్తున్నారని ట్రంప్‌ ఆరోపించారు. రిపబ్లికన్‌ పార్టీ నేత అయిన డొనాల్డ్‌ ట్రంప్‌ 2017-21 మధ్య అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో రెండో పర్యాయం అధ్యక్ష పదవికి పోటీచేసినా.. డెమెక్రటిక్‌ పార్టీ అభ్యర్థి బైడెన్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. 2024లో జరుగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగాలని ట్రంప్‌ ఉవ్విళ్లూరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story