Trump: భారత్ టారిఫ్‌లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

భారత్, అమెరికాల బంధం ఇప్పటివరకూ ఏకపక్షంగా కొనసాగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ పై మొన్నటి వరకు అమెరికా ఎలాంటి సుంకాలు విధించలేదని, భారత్ మాత్రం అమెరికా వస్తువులపై 100 శాతం పన్నులు విధించిందని ఆరోపించారు. దీంతో భారత వస్తువులు అమెరికాలోకి డంప్ అయ్యేవనీ, అమెరికా మాత్రం భారత్ కు ఎలాంటి ఎగుమతులు చేయలేకపోయందని చెప్పారు.
‘భారత దేశం మనపై ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలు విధిస్తుంటే మనమేమో ఫూలిష్ గా భారత్ పై అసలు సుంకాలే వేయలేదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సుంకాల వ్యత్యాసం వల్ల భారత వస్తువులు మన మార్కెట్ ను ఆక్రమించాయని, ఆ వస్తువులు ఇక్కడ తయారయ్యే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. భారత్ సుంకాల విధానం కారణంగా అమెరికా కంపెనీలు బయటకు వెళ్లి నిర్మాణాలు చేపడుతున్నాయన్నారు. ఈ మేరకు మంగళవారం ఓవెల్ కార్యాలయంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా భారత్ పై విధించిన సుంకాలను తగ్గించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు జవాబిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికాల మధ్య ఆర్థిక సంబంధాలు ఇన్నాళ్లూ ఏకపక్షంగా కొనసాగాయని, తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాకే మార్పు వచ్చిందన్నారు. అధిక సుంకాల కారణంగా హార్లే డేవిడ్ సన్ కంపెనీ భారత్‌లో ప్లాంట్‌ను నిర్మించి విక్రయాలు జరపాల్సిన పరిస్థితి వచ్చిందని ట్రంప్ ఆరోపించారు. తాజాగా తాను విధించిన సుంకాల వల్ల వేలాది కంపెనీలు అమెరికాకు వస్తున్నాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com