Trump: భారత్-పాక్ యుద్ధం ఆపితే గుర్తించలేదు.. నెతన్యాహుతో ట్రంప్

భారత్-పాకిస్థాన్ యుద్ధం విషయాన్ని ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపితే సరైన క్రెడిట్ దక్కలేదని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో నెతన్యాహును కలిసిన సందర్భంగా మరోసారి ట్రంప్ గుర్తుచేశారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత ప్రభుత్వం మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. అయితే రెండు దేశాలను వాణిజ్య హెచ్చరికలతో బెదిరించడంతో కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ ప్రకటనను పాకిస్థాన్ స్వాగతించగా.. భారత్ తోసిపుచ్చింది. మూడో వ్యక్తి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. అయినా కూడా ట్రంప్ పలుమార్లు.. ఆయా దేశాల పర్యటనల్లోనూ… ఆయా దేశాధ్యక్షుల దగ్గర భారత్-పాకిస్థా్న్ యుద్ధాన్ని ఆపినట్లుగా చెప్పుకొచ్చారు. ఇలా ఇప్పటి వరకు 70 సార్లు ఆ విషయాన్ని ప్రస్తావించారు. తాజాగా నెతన్యాహు అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయనతో కూడా ఈ విషయాన్ని గుర్తుచేసి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలు ఆపినా కూడా నోబెల్ శాంతి బహుమతి రాలేదని వాపోయారు.
ట్రంప్-నెతన్యాహు సమావేశంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సేత్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, సీనియర్ పరిపాలన అధికారులు పాల్గొన్నారు. ఇరువురు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

